ఏమాటకు ఆమాటే.. మోడీ తోపే!!
ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును సృష్టించారు. 4399 రోజుల పాటు(జూన్ 10తో) ఆయన దేశానికి వరుసగా ప్రధాని పీఠంపై కూర్చున్నారు.
By: Garuda Media | 10 Jun 2026 12:53 PM ISTపాలనపరంగా విమర్శలు.. వ్యక్తిగతంగా లోటుపాట్లు.. ఎన్ని ఉన్నప్పటికీ ప్రధానిగా నరేంద్ర మోడీ సృష్టించిన అరుదైన రికార్డును కనుచూపుమేరలో ఎవరు అధిగమించలేరు అన్నది స్పష్టం అవుతోంది. ప్రధానమంత్రిగా 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించారు. తొలి ప్రధానమంత్రి నెహ్రూతో పాటు ఆయన కుమార్తె తదుపరి ప్రధాని ఇందిరాగాంధీ రికార్డులను కూడా అధిగమించి ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును సృష్టించారు. 4399 రోజుల పాటు(జూన్ 10తో) ఆయన దేశానికి వరుసగా ప్రధాని పీఠంపై కూర్చున్నారు.
ఇప్పటికీ 62 శాతం మంది అనుకూలం
ఈ తరహా రికార్డును కనుచూపుమేరలో ఇంకెవరు అధిగమించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్ పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ పుంజుకునే పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. దేశంలో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగుతోందని చెప్పటానికి తాజాగా చేపట్టిన ఒక ఆన్లైన్ సర్వే స్పష్టం చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి ఇప్పటికీ 62 శాతం మంది అనుకూలంగా ఉండడం విశేషం. 35 శాతం మంది మాత్రమే రాహుల్‌గాంధీని ప్రధానిగా కోరుకుంటున్నారు. దీనిని బట్టి తదుపరి ఎన్నికల్లో కూడా మరోసారి మోడీ గెలిచినా ఆశ్చర్యం లేదన్నది ప్రస్తుతం జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మాట.
ఇప్పటి వరకు అయితే కాంగ్రెసేతర పార్టీలకు చెందిన, ముఖ్యంగా బిజెపికి చెందిన నాయకుడు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడం, వరుసగా మూడుసార్లు విజయం సాధించడం అనేది ఆశ్చర్యకర పరిణామమే. అయినప్పటికీ అది మోడీతోనే సాధ్యమైంది అన్నది వాస్తవం. ఇండియా కూటమి పరిస్థితిని గమనిస్తే మోడీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే ఇండియా కూటమి బలంగా ప్రయత్నించింది. మోడీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపుతామని కూడా ప్రకటించింది.
రాజ్యాంగం నుంచి ఎస్సీ ఎస్టీల వరకు కూడా అనేక అంశాలను తెరమీదకు తీసుకొచ్చారు. ధరల పెరుగుదలతో పాటు అంబానీ అదాని అంశాలను కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రజలు మోడీ వైపే మొగ్గు చూపారు. కొంత మెజారిటీ తగ్గినప్పటికీ ఇతర భాగస్వామి పక్షాలతో కలిసి ఆయన 2024లో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం దేశంలో ధరలు పెరిగాయి.. జీవన ప్రమాణాలు కూడా ఒకంత తగ్గుముఖం పట్టాయి.. అన్న వార్తలు వస్తున్నప్పటికీ బలమైన నాయకుడిగా శక్తివంతమైన ప్రధానిగా ఇప్పటికీ మోడీనే ఉన్నారని తాజాగా జరిగిన ఆన్లైన్ సర్వే ఒకటి స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఏ మాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే మోడీని తోపని ఒప్పుకోక తప్పదు!!.
