Begin typing your search above and press return to search.

మోడీ కేసీఅర్ ప్రేమ చిగురిస్తోందా ?

రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయని అనుకోవాల్సిందే. ఈ రోజున బీజేపీ దేశంలోనే బలమైన పార్టీగా ఉంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 2:58 PM GMT
మోడీ కేసీఅర్ ప్రేమ చిగురిస్తోందా ?
X

రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయని అనుకోవాల్సిందే. ఈ రోజున బీజేపీ దేశంలోనే బలమైన పార్టీగా ఉంది. వరసగా కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. నెహ్రూ ఇందిరాగాంధీ తరువాత ఆ అరుదైన రికార్డుని మోడీ సాధించారు.

ఇక తెలంగాణలో అధికారం సాధించడానికి బీజేపీ చూస్తోంది. దక్షిణాదిన కాషాయం జెండా ఎగరేయాలని ఉబలాట పడుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో తనదైన రాజకీయం చేస్తోంది. ఏపీలో కూటమి కట్టి తన రాజకీయ ఉనికిని బలంగా చాటుకున్న బీజేపీ తెలంగాణాలోనూ తన మార్క్ పాలిటిక్స్ ని అమలు చేస్తోంది అని అంటున్నారు.

తెలంగాణాలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి. రెండూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీదనే గురి పెట్టాయి. రెండు పార్టీలు హస్తం పార్టీని అస్తవ్యస్తం చేసి అధికారం అందుకోవాలని తప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య గత కాలం నాటి అనుబంధం వెల్లి విరిసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.

గతంలో అంటే 2014 నుంచి తెలంగాణాలో కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు కేంద్రంలో బీజేపీతో కొంత సఖ్యతగా వ్యవహరించారు అన్న ప్రచారం అయితే ఉంది. ఆయన ఆ విధంగా కేంద్రం సాయం తీసుకుని ఆరు నెలల ముందుగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు పెట్టుకుని అధికార పీఠం రెండవసారి అందుకున్నారు అన్న ప్రచారమూ నడచింది. ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఆసక్తిని చూపించడం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చడంతో పాటు బీజేపీ మీద విమర్శలు చేయడంతో రాజకీయం మారింది అని అంటారు.

ఇకపోతే ఇపుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎంత విస్తరించినా అధికారం అందుకునేంతగా ఆ బలం ఉండదని అంటున్నారు. దాంతో పాత పరిచయాలు కాస్తా మళ్ళీ అభిమానంగా మారుతాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక దేశంలో కాంగ్రెస్ లేని జాతీయ రాజకీయం చేయాలని ఉబలాటపడుతున్న బీజేపీ బీఆర్ఎస్ కి స్నేహ హస్తం అందించినా ఆశ్చర్యం రాజకీయాల్లో ఉండదనే అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే దేశంలో కాంగ్రెస్ కి మూడు రాష్ట్రాలే సొంతంగా అధికారంలో కలిగి ఉన్నవి ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ ని పొలిటికల్ గా దెబ్బ తీయాలని అనుకుంటే తనదైన మాస్టర్ ప్లాన్స్ అమలు చేసే చాలు అని అంటున్నారు ఇక తెలంగాణాలో చూస్తే బీఆర్ ఎస్ ని కలుపుకుని బీజేపీ ముందుకు సాగుతుందా అన్న చర్చకు దారి తీసేలా ఒక కీలక పరిణామం అయితే జరిగింది.

కేసీఅర్ అక్క సకలమ్మ ఇటీవల మరణించారు. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ కేసీఅర్ కి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సైతం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీల మధ్య బంధం కొత్తగా చిగురుస్తోందా అన్న చర్చ బయల్దేరింది. మామూలుగా అయితే దీనిని ఎవరూ పట్టించుకోరు,

కానీ ఇపుడు తెలంగాణాలో ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో ఈ పరామర్శ వెనక కూడా అర్థాలు వెతుకుతూ విశ్లేషణలు చేస్తున్నారు. మళ్ళీ మోడీ కేసీఅర్ ల మధ్య ప్రేమ చిగురిస్తోందా అన్నదే ఆ చర్చగా ఉంది. ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో కాదేదీ అనర్హం కాబట్టి ఏమైనా జరగవచ్చు అని కూడా భావించాల్సి ఉంది అంటున్నారు.