మోడీకి వెల్ కం వేళ.. నెతన్యాహు నోట ఆసక్తికర పోలిక
కొన్ని సందర్భాల్లో అరుదైన ఘనతలు సాధించినా వాటికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు. దీనికి కారణం.. ఆ ఘనతను గుర్తించే పరిస్థితి ఉండకపోవటం ఒకటైతే.. అంతలోతుగా చూసే వారు లేకపోవటం కూడా ఒక కారణం
By: Garuda Media | 26 Feb 2026 10:21 AM ISTకొన్ని సందర్భాల్లో అరుదైన ఘనతలు సాధించినా వాటికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు. దీనికి కారణం.. ఆ ఘనతను గుర్తించే పరిస్థితి ఉండకపోవటం ఒకటైతే.. అంతలోతుగా చూసే వారు లేకపోవటం కూడా ఒక కారణం. దేశ ప్రధానిగా అత్యున్నత స్థాయిలో ఉన్న వారు.. తమ డబ్బాను తాము కొట్టుకోలేరు కదా. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరి అందరూ సొంత డబ్బా కొట్టుకోలేని పరిస్థితి. ఈ కారణంగానే తాజాగా జరుపుతున్న ఇజ్రాయెల్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన ఘనతను సాధించారు. అదేమిటన్నది ఈ కథనంలో చివర్లో చదివితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది.
భారతకు నమ్మకమైన మిత్రుల్లో ఒకరు ఇజ్రాయెల్. తన పదవీ కాలంలో రెండోసారి ఇజ్రాయెల్ కు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. టెల్ అవీవ్ కు 20 కి.మీ. దూరంలో ఉండే బెన్ గురియన్ ఎయిర్ పోర్టులో దిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. ఆయన సతీమణి సారా నెతన్యాహు రెడ్ కార్పెట్ స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా మోడీని ఇజ్రాయెల్ ప్రధాని అప్యాయంగా ఆలింగనం చేసుకొని పలుకరించారు. ఈ సందర్భంగా వారి మధ్య చోటు చేసుకున్న సంభాషణ ఆసక్తికరంగా మారింది.
అంతర్జాతీయ ప్రముఖులు భారత్ కు వచ్చినా.. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంలోనూ ఆయన వస్త్రధారణపై తరచూ ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించటం చూస్తే.. మోడీ డ్రెస్సింగ్ ను అంతర్జాతీయ నేతలు కూడా ప్రత్యేకంగా చూస్తారా? అన్న సందేహం కలుగకమానదు.
ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయిన ప్రధాని మోడీకి స్వాగతం పలికే వేళలో.. నెతన్యాహు సతీమని సారా.. ధరించిన డ్రెస్ కలర్ లోనే.. మోడీ కోటు జేబులో ఉన్న రుమాలు రంగు ఒకటే కావటాన్ని నెతన్యాహు ప్రస్తావించారు. సారా డ్రెస్ కలర్.. మోడీ రుమాలు కలర్ ఒకేలా ఉండటంపై ఇజ్రాయెల్ ప్రధాని నవ్వుతూ ప్రస్తావించిన అంశానికి స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. అది కాషాయ రంగు అంటూ నవ్వుతూ చెప్పారు.
ఇదిలా ఉండగా..ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా అమితమైన ప్రాధాన్యతను ఇవ్వటం గమనార్హం. జెరూసలేం పోస్ట్ పత్రిక బుధవారం నాటి సంచిక మొదటి పేజీలో మోడీ అభివాం చేస్తున్న ఫోటోను ప్రచురించి.. వెల్ కమ్ మోడీ అని హెడ్డింగ్ పెట్టటమే కాదు.. హిందీలో నమస్తే అన్న క్యాప్షన్ ఇవ్వటం గమనార్హం. ఇదిలా ఉండగా.. తొలిసారి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ లోకి ప్రవేశిస్తున్న వేళ.. ఎంపీలు గౌరవంగా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలకటం ఒక ఎత్తు అయితే.. మోడీ మోడీ అంటూ నినాదాలు వినిపించటం విశేషంగా చెప్పాలి. భారత ప్రధాని ఒకరు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించటం ఇదే తొలిసారి.
అంతేకాదు.. ప్రధాని మోడీని ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ ఆఫ్ ది కనెసెట్ మెడల్ తో సత్కరించారు. కనె సెట్ అందించే అత్యున్నత పురస్కారం ఇదే కావటం గమనార్హం. భారత్ - ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోడీ చేసిన క్రషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లుగా పార్లమెంట్ తెలిపింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ మెడల్ ను అందుకున్న తొలి నేత మోడీనే.
ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఇజ్రాయెల్ కు తన పొరుగు దేశమైన పాలస్తీనాకు మధ్య దశాబ్దాల తరబడి పంచాయితీ నడవటమే కాదు.. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే మంట మండేలా పరిస్థితులు ఉంటాయి. ఈ రెండు దేశాలకు ఒకదానితో మరొకదానికి పడదు. అదే సమయంలోఒకరికి మిత్రుడు.. మరోకరికి ఏ మాత్రం మిత్రుడు కాలేడు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మాత్రం మోడీకే దక్కతుంది. ఎందుకంటే.. ఇజ్రాయెల్ పార్లమెంట్ నుంచి అత్యున్న పురస్కార మెడల్ ను అందుకున్న మోడీ.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పాలస్తీనాలో అత్యుత్తమ పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనాను స్వీకరించారు. ఇలా రెండు దేశాల అరుదైన.. అత్యున్నత గౌరవాల్ని అందుకున్న తొలి విదేశీ నేతగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారని చెప్పాలి. అయితే.. ఇంతటి ఘనతను సాధించినప్పటికీ కొన్ని మీడియా సంస్థల్లో తప్పించి.. మిగిలిన మీడియాలో పెద్దగా ఫోకస్ కాకపోవటం గమనార్హం.
