Begin typing your search above and press return to search.

మోడీ అమరావతి...ఆ చాన్స్ ఇవ్వరా ?

నరేంద్ర మోడీ మీద ప్రత్యర్ధులు చేసే అనేక విమర్శలలో ఒకటి కీలకంగా ఉంటుంది. అది ఏపీ సెంటిమెంట్ తో ముడిపడి కూడా ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 April 2025 6:00 PM IST
మోడీ అమరావతి...ఆ చాన్స్ ఇవ్వరా ?
X

నరేంద్ర మోడీ మీద ప్రత్యర్ధులు చేసే అనేక విమర్శలలో ఒకటి కీలకంగా ఉంటుంది. అది ఏపీ సెంటిమెంట్ తో ముడిపడి కూడా ఉంటుంది. ఏపీకి రాజధానిగా గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని ప్రకటించింది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు రావాలని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా ఆహ్వానించింది. నిజానికి అపుడే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఏపీలో మిత్రపక్షంగా టీడీపీ అధికారంలోకి వచ్చి అంతే సమయం అయింది.

విజయాలు అన్నీ పచ్చగా ప్రకాశిస్తునాయి. కోరికలు అన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఏపీ అప్పటికి అడ్డగోలు విభజనతో పూర్తిగా కునారిల్లుతోంది. దాంతో కేంద్రంలో కూడా మిత్ర ప్రభుత్వమే ఉంది పైగా ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీకి నిర్మించి ఇస్తామని ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఏపీ పర్యటనలో చేసిన హామీలు ఉండనే ఉన్నాయి.

దాంతో మోడీ 2015 అక్టోబర్ 22న అమరావతి వచ్చినపుడు భారీ వరాలే ప్రసాదిస్తారు అని అంతా ఆశించారు. నిజం చెప్పాలంటే అయిదు కోట్ల మంది ఆంధ్రులు అంతా టీవీలకు అతుక్కుని పోయి మోడీ ప్రసంగాన్ని విన్నారు అయితే మోడీ మాత్రం మట్టి చెంబుడు నీళ్ళు తీసుకుని వచ్చారు. వాటిని ఆయన ఏపీ పాలకులకు అందిస్తూ అమరావతి దివ్యంగా వెలిగిపోతుందని దీవించి వెళ్ళిపోయారు.

ఈ మట్టి నీళ్ళను చూసిన వారు అంతా అవాక్కయ్యారు. కేంద్రమేదో ఏపీకి భారి సాయం చేస్తుంది అనుకుంటే ఏమిటిలా అని అంతా అనుకున్నారు. ఆ మీదట మోడీ మీద ఎవరు విమర్శలు చేసిన ఇదే ముందు పెట్టి చెడుగుడు ఆడేవారు. వారూ వీరూ కాదు ఆనాడు మిత్రపక్షంగా ఉంటూ మోడీకి ఘన స్వాగతాలు చేసిన టీడీపీ 2018 నాటికి విడిపోయి ప్రత్యర్ధి అయింది దాంతో టీడీపీ నేతలే మోడీ మీద ఈ విమర్శలతో చెలరేగిపోయేవారు.

అయితే వాటిని ఏపీ బీజేపీ నేతలు తిప్పికొట్టేవారు. అది వేరే విషయం అనుకోండి. మరి ఇపుడు చూస్తే సరిగ్గా అదే సీన్. కాలం పదేళ్ళు ముందుకు సాగింది కానీ ప్రధాని మోడీయే సీఎం చంద్రబాబు, వేదిక అమరావతి రాజధానే. పనులు పునర్ ప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ మోడీ చేతుల మీదుగా వాటికి శ్రీకారం చుడుతోంది. మే 2న అమరావతికి వస్తున్న మోడీ ఏమి తెస్తున్నారు అన్న చర్చ సహజంగానే సాగుతుంది. ఎందుకంటే కేంద్రం పెద్దన్న కాబట్టి ఈసారి అయినా మోడీ సార్ ఏపీ మీద పూర్తిగా కరుణా కటాక్షాలు చూపిస్తారు అని అనుకుంటున్నారు.

మరి మోడీ ఈసారి భారీ వరాలు ఇస్తారా అన్నదే అంతటా చర్చ. నిజంగా మోడీ తలచుకుంటే రాజధాని కోసం కేంద్రం తరఫున ఎన్ని అయినా ఇవ్వవచ్చు. ఇక చూస్తే గతానికి ఇప్పటికీ కొంత వాతావరణం మారింది. టీడీపీ పట్ల చంద్రబాబు పట్ల మోడీ అనుకూలవైఖరితో ఉన్నారు. బాబు కూడా అమరావతి కోసం గట్టి పట్టుదల మీద ఉన్నారు.

మోడీ అయితే కొన్ని వరాలు అయినా ప్రకటించి ఏపీ ప్రజల అభిమానం పొందుతారు అని అంటున్నారు గతంలో తన మీద వచ్చిన విమర్శలకు ఈసారి ఆయన ఏ విధంగానూ చాన్స్ ఇవ్వబోరని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీ బీజేపీ నేతలు కొందరు మాత్రం మోడీ మళ్ళీ వచ్చి అమరావతి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏముందని అంటున్నారుట.

ఒకవేళ మోడీ వరాలు ఏవీ ప్రకటించకుండా వెళ్ళిపోతే మరోసారి ఆయన మీద ప్రత్యర్ధులు విమర్శలు చేసేందుకు కాచుకుని ఉంటారని అంటున్నారు. మోడీ కానీ కేంద్రం కానీ వరాలు ప్రకటించడం బహిరంగంగా చెప్పడం కంటే ఏపీ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికపుడు స్పందిస్తోందని గుర్తు చేస్తున్నారు. కానీ ఈ ప్రకటనలు చేయడం అన్నది ఫక్తు రాజకీయం అని మోడీ అలా చేయడానికి ఇష్టపడకపోతే నిందలు ఆయనతో పాటు బీజేపీ కూడా మోయాల్సి వస్తుందని అంటున్నారు. మరి మోడీ ఏమి చేస్తారు అన్నది మే 2న తేలిపోనుది. అంత వరకూ వెయిట్ అండ్ సీ.