Begin typing your search above and press return to search.

వారిని మెప్పించి.. వీరిని నొప్పించి.. మూర్తి కామెంట్స్ పై మిక్స్డ్ రియక్షన్!

3వన్‌4 క్యాపిటల్‌ పాడ్‌ కాస్ట్‌ "ది రికార్డ్‌" అనే ఎపిసోడ్‌ పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:29 PM GMT
వారిని మెప్పించి.. వీరిని నొప్పించి.. మూర్తి కామెంట్స్  పై మిక్స్డ్  రియక్షన్!
X

అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే భారతదేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 3వన్‌4 క్యాపిటల్‌ పాడ్‌ కాస్ట్‌ "ది రికార్డ్‌" అనే ఎపిసోడ్‌ పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంతో పోటీ పడటానికి భారతదేశంలోని పని సంస్కృతిలో మార్పు అవసరమని నొక్కి చెప్పారు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అవును... ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా తక్కువగా ఉన్న ఉత్పాదకత పెరగకుండా.. ప్రభుత్వంలో వేళ్లూనుకున్న అవినీతిని తగ్గించకుండా.. అధికార నిర్ణయాల్లో జాప్యం తొలగకుండా.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం దాదాపు అసాధ్యం అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో యువత ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇందులో భాగంగా... నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపానీయులు ఇదే పనిచేశారని నారాయణమూర్తి తెలిపారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా నెటిజన్ల నుంచి కామెంట్లు కాస్త గట్టిగానే వస్తున్నాయి.

ఈ క్రమంలో... ఉత్పాదకత పెరగాలంటే ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం లేదని ఒకరంటే... మెరుగైన పని వాతావరణం, సరిపడా వేతనం అందిస్తే.. ఇంకా ఎక్కువ ఉత్పాదకత రాబట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో... అందరికీ పని ప్రదేశం దగ్గర్లో ఉండదని, ట్రాఫిక్‌ చిక్కులు వంటి సమస్యలతో నిత్యం సావాసం చేయాల్సి ఉంటుందని, అలాంటి ప్రాక్టికల్‌ ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో... కంపెనీలు గంటల ప్రాతిపదికన (ఆదనపు) వేతనాలు చెల్లించడానికి అంగీకరిస్తే, కొంతమంది ఉద్యోగులు వారానికి సాధారణ 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం గురించి ఆలోచిస్తారని మరో నెటిజన్ అన్నారు. వారానికి 40 గంటలు అంటే... ఐదు పనిదినాల్లో రోజుకి 8 గంటలు అన్నమాట! అంటే... అంతకంటే ఎక్కువ పనిగంటలు చేస్తాం... మరి వేతనం అని అంటున్నారు. పిండికొద్దీ రొట్టే టైపులో అన్నమాట!!

ఇదే క్రమంలో నారాయణమూర్తి చెప్పినట్లు వారానికి 70 గంటలు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అందుకు తగిన వేతనం కూడా ఇస్తారా అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశారు. దీంతో... నారాయణమూర్తి చెప్పిన వర్క్‌ కల్చర్‌ వ్యవహారంపై యువత కాస్త గట్టిగానే విభేదిస్తున్నట్లుందని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క... నారాయణమూర్తి అభిప్రాయాన్ని కొంతమంది బాస్‌ లు మాత్రం స్వాగతించారు. ఇందులో భాగంగా... వర్క్‌ కల్చర్‌ గురించి నారాయణమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నారాయణ మూర్తి అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. దీంతో... నారాయణమూర్తి వ్యాఖ్యలు బాస్ ఎంప్లాయీ వర్సెస్ ఎంప్లాయర్ వార్ కి తెరతీసినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!