మంత్రి గారి ఇలాకా: ఆ నియోజకవర్గం సూపర్...!
ఇలాంటి మంత్రుల్లో ముందున్నారు.. మంత్రి నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు నారాయణ.
By: Tupaki Desk | 16 July 2025 8:00 AM ISTఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు, మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికార పార్టీలోనే ఉన్నా.. ఎమ్మెల్యేలు అనుకున్న విధంగా నిధులు తెచ్చుకునే పరిస్థితి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ.. మంత్రుల విషయంలో అలా కాదు.. కేబినెట్‌లో చర్చించి అయినా.. సీఎం దృష్టికి తీసుకువెళ్లయినా.. పనులు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే.. నిరంతరం ముఖ్యమంత్రికి చేరువగానే ఉంటారు.
ఈ క్రమంలో మంత్రులకు తమ తమ నియోజకవర్గాలకు నిధులు తెచ్చుకునేందుకు, అభివృద్ధి చేసుకునేందుకు భారీ స్కోప్ ఉంటుంది. అయితే.. ఇలా ఎంత మంది ఆలోచన చేస్తున్నారు? అనేది మాత్రం వేళ్లమీదే లెక్కించాల్సి ఉంటుంది. ఇలాంటి మంత్రుల్లో ముందున్నారు.. మంత్రి నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు నారాయణ. అయితే.. ఈ నియోజకవర్గం సునిశితం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా.. మారే అవకాశం ఉంటుంది.
బహుశ దీనిని పసిగట్టారో ఏమో తెలియదు కానీ.. నారాయణ ఎక్కువగా నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రహదారులు నిర్మిస్తున్నారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. క్షణాల్లో పరిష్కారం అయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. గత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇప్పుడు వాటిని కూడా మంత్రి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం కూడా.. ఉంది.
మంత్రిగా నారాయణ ఫుల్లు బిజీ. ఒక వైపు అమరావతి నిర్మాణాలకు ఆయనే బాధ్యుడు. మరోవైపు పురపాల క శాఖ మంత్రిగా కూడా.. ఆయన చూస్తున్నారు. దీంతో ఆయన నిరంతరం బిజీగానేఉంటున్నారు. ఈ నేపషథ్యంలో నియోజకవర్గంలో బరువు బాధ్యతలను నేరుగా ఆయన సతీమణికి అప్పగించారు. ఆమెకు ముగ్గురు పీఏలను కూడా నియమించారు. వీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు సిటీలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సో.. ఇదీ.. పనిచేసుకునే మంత్రిగా నారాయణకు దక్కిన పేరు.
