Begin typing your search above and press return to search.

విహారిపై ఫృథ్విరాజ్ తండ్రి తీవ్ర ఆరోపణలు... తెరపైకి పవన్ కల్యాణ్!

ఈ నేపథ్యంలో ఫృథ్వీరాజ్ తండ్రి, వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి ఎంట్రీ.. విహారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడు తాగుబోతు, గంజాయి తాగే వ్యక్తి అని ఆరోపించారు!

By:  Tupaki Desk   |   27 Feb 2024 10:53 AM GMT
విహారిపై ఫృథ్విరాజ్  తండ్రి తీవ్ర ఆరోపణలు... తెరపైకి పవన్  కల్యాణ్!
X

ఆంధ్ర రంజీ టీం కెప్టెన్ గా హనుమ విహారీని తొలగించడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జట్టులోని 17వ ఆటగాడైన ఫృథ్వీరాజ్ పై విహారీ దురుసుగా ప్రవర్తించాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు ఫిర్యాదు రావడం, దీంతో అతడు రాజీనామా చేయడం తెలిసిందే! దీంతో తన కెప్టెన్సీ పోవడం వెనుక రాజకీయ కోణం ఉందంటూ హనుమ విహారీ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపుతుంది.

అవును... తనను ఏపీ రంజీ టీం కెప్టెన్ గా తొలగించడంపై విహారీ ఆన్ లైన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో... అధికార వైసీపీకి చెందిన కార్పొరేటర్ కుమారుడే ఆ 17వ ఆటగాడని.. అందువల్లే విహారీ కెప్టెన్ పదవి పోయిందని ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫృథ్వీరాజ్ తండ్రి, వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి ఎంట్రీ.. విహారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడు తాగుబోతు, గంజాయి తాగే వ్యక్తి అని ఆరోపించారు!

ఇదే సమయంలో అతడు తన కుమారుడిని క్రికెట్ లో ఎదగనివ్వకుండా అణగదొక్కాలని చూశాడని.. జట్టులో ఆడేందుకు అవకాశం ఇవ్వకుండా 17వ ప్లేయర్ గా ఉంచాడని ఆరోపించారు. ఇదే క్రమంలో తన కుమారుడిని అకారణంగా బూతుల్లు తిట్టాడని.. దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. ఆ విషయాన్ని తాను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. విషయం తెలుసుకోకుండా అలాంటి వ్యక్తికి రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం దారుణమని అన్నారు.

పవన్ కల్యాణ్ ఎంట్రీ!:

విహారీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... పవన్ కల్యాన్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆన్ లైన్ లో పెద్ద పోస్ట్ పెట్టారు! ఈ క్రమంలో... "16 టెస్టు మ్యాచ్‌ లలో మన భారత్ కు ప్రాతినిధ్యం వహించి, 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశారని అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో అతడి పెర్ఫార్మెన్స్ మరువలేనిది" అని పవన్ తెలిపారు! ఇదే సమయంలో రంజీ క్రికెట్ లో ఏపీ కోసం అతడు సర్వస్వం దారపోశాడని తెలిపారు.

ఇదే సమయంలో... ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ గా విహారీ గత ఏడేళ్లలో ఐదుసార్లు నాకౌట్ కు అర్హత సాధించేలా చేయగలిగారని చెప్పిన పవన్... చేయి విరిగినా, మోకాలికి గాయమైనా జట్టుకోసం క్రీజ్ లోకి వచ్చి ఆడారని అన్నారు. ఈ సమయంలో... ఇంతటి ప్రతిభ కలిగిన వ్యక్తిని ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగా కెప్టెన్ గా తొలగించడం ఏమాత్రం సరైంది కాదని.. ఈ విషయంలో ఏసీఏ వ్యవహరించిన తీరు వల్లే అతడు ఆంధ్రా జట్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు!