Begin typing your search above and press return to search.

మళ్లీ మంగళగిరే అంటున్న లోకేష్... కారణం ఇదేనంట!

యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న నారా లోకేష్.. ప్రస్తుతం మంగళగిరిలో కంటిన్యూ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:19 AM GMT
మళ్లీ మంగళగిరే అంటున్న లోకేష్... కారణం ఇదేనంట!
X

యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న నారా లోకేష్.. ప్రస్తుతం మంగళగిరిలో కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానం.. సాధించబోయే మెజారిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

అవును... రాబోయే ఎన్నికల్లో తాను మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు నారా లోకేష్. ఓడిపోయిన చోటే గెలిచి టీడీపీకి గిఫ్ట్ ఇస్తాన‌ని ఆయన ధీమాగా చెబుతున్నారు. రాజ‌ధాని మార్పు, అలాగే ప్రజావ్యతిరేక విధానాల‌తో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక‌త ఎదుర్కొంటోంద‌ని.. కావున ఎలాగైనా ఈ సారి గెలుస్తాన‌ని ధీమాగా వున్నారు.

వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు హారయ్యారు లోకేష్. కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచేది తానేనని చెప్పారు నారా లోకేష్.

వాస్తవానికి మంగ‌ళ‌గిరి అనేది టీడీపీ సీటు కానే కాదు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌, వైసీపీకి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. ఇక్కడ 1999, 2004, 2009 లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. తర్వాత 2014, 2019లో వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా మంగళిగిరిలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు!

సామాజికవర్గాల పరంగా చూస్తే... ఈ నియోజకవర్గంలో చేనేతలు గెలుపోటములను ప్రభావితం చేస్తారు! దీంతో... ఈ నియోజకవర్గంలో ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలు ఇద్దరు వైసీపీలో కొనసాగుతున్నారు. వారిలో ఎం.హ‌నుమంత‌రావు ఎమ్మెల్సీగా ఉండగా.. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన గంజి చిరంజీవి చేనేత కార్పొరేష‌న్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు.

ఈ ఇద్దరి నాయ‌కుల‌తో పాటు చేనేత‌ల‌కు వైసీపీ సర్కార్ అత్యధికంగా సాయం చేస్తుందని అంటున్నారు. ఫలితంగా వారి ఆద‌ర‌ణ పొంది, ముచ్చట‌గా మూడోసారి మంగ‌ళ‌గిరి నుంచి వైసీపీ జెండా ఎగురేయ‌వ‌చ్చని సీఎం వైఎస్ జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే... రాజ‌ధాని మార్పుతో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక‌త ఎదుర్కొంటోంద‌ని.. ఫలితంగా ఈసారి ఎలాగైనా మంగళగిరిలో గెలుస్తాన‌ని లోకేష్ ధీమాగా వున్నారు.