Begin typing your search above and press return to search.

లోకేష్ కి చాలా బాధ్యతలు....చిట్టా పెద్దదే...!

దీని కంటే ముందు చిత్తూరు జిల్లా ఎస్పీ కి కళ్లకు పొరలు కమ్మాయని దాన్ని తొలగించి ఆపరేషన్ చేసే బాధ్యత తాను తీసుకుంటాను అని లోకేష్ మరో సభలో చెప్పారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 1:13 PM GMT
లోకేష్ కి  చాలా బాధ్యతలు....చిట్టా పెద్దదే...!
X

నారా లోకేష్ కేరాఫ్ చంద్రబాబు. ఆయన యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నా చంద్రబాబు తనయుడిగానే జనాలు గుర్తిస్తున్నారు. మార్క్ పాలిటిక్స్ కి ఇంకా సమయం రాలేదని ఆ పార్టీ తమ్ముళ్ళు అంటూంటారు. అయితే తన మార్క్ ఏంటో కుప్పం సభ నుంచి లోకేష్ చెబుతూ వస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర వెళ్లిన ప్రతీ చోటా ఆయన లోకల్ లీడర్స్ చిట్టా తవ్వి తీయడం పనిగా పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి విషయం ఏంటో చూసుకుంటా అని హెచ్చరిం చదం లోకేష్ కి పరిపాటి అయిపోయింది. ఆ బాధ్యత నేను తీసుకుంటా అంటూ లోకేష్ ఎన్ని సభలలో చెప్పారో లెక్క చూసుకోవాలేమో.

అలా ఆయన చిట్టా కూడా అంతకంతకు పెద్దది అవుతోంది. ఇక ఆయన అన్ని సభలలో చెప్పినది ఒక ఎత్తు అయితే గన్నవరం సభలో గరం గరం గా మాట్లాడినది మరో ఎత్తు. ఆయన ఏకంగా మాజీ మంత్రిని ఉద్దేశించి గన్నవరంలో ప్రసంగించారు. నా తల్లిని శాసనసభ వేదికగా విమర్శించారు అంటూ గుడివాడ ఎమ్మెల్యేను ఏకవచన ప్రయోగంతో విమర్శించారు

తొమ్మిది నెలలు ఆగితే వచ్చేది మన ప్రభుత్వమే. ఇదే గుడివాడ వీధులలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో పరిగెత్తించేలా చేసే బాధ్యత తాను తీసుకుంటాను అంటూ లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది. నిజంగా లోకేష్ అధికారంలోకి వస్తే పేదలకు పధకాలు అందాయో లేవో చూడాల్సిన బాధ్యత తీసుకుంటే సంతోషించే వారు ఉంటారు.

అలాగే ఏపీలో అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటాను అని చెప్పినా లోకేష్ కి సబబుగా ఉండేది. అది ఏపీలోని కోట్లాది ప్రజల మనసుని గెలుచుకుని ఉండేది. కానీ లోకేష్ మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నారు. తన తండ్రి చంద్రబాబులా తాను సాఫ్ట్ కానే కాదని అంటున్నారు. తాను మంచిగా ఉండనని చెబుతున్నారు. అలా మాస్ అప్పీల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగా డోస్ పెంచుతూ ఈ రోజుకి గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో పరుగులు పెట్టిస్తాను అని చెప్పుకొస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటాను అని లోకేష్ చెబుతున్నారు. దీని కంటే ముందు చిత్తూరు జిల్లా ఎస్పీ కి కళ్లకు పొరలు కమ్మాయని దాన్ని తొలగించి ఆపరేషన్ చేసే బాధ్యత తాను తీసుకుంటాను అని లోకేష్ మరో సభలో చెప్పారు.

ఇలాగే ఏ జిల్లాకు వెళ్తే ఆయా జిల్లాల నాయకుల చిట్టా తన దగ్గర ఉందని చెబుతున్నారు అంతే కాదు పోలీసుల విషయంలోనూ ఆయన చాలానే మాట్లాడుతున్నారు. వైసీపీకి కొమ్ము కాసే పోలీసుల విషయంలో రెడ్ బుక్ ని పెట్టి మరీ వివరాలు అన్నీ నోట్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇదంతా పార్టీలో కొంతమందిని ఉత్సాహపరచేందుకు ఉపయోగపడుతుందేమో కానీ సామాన్య జనాలకు ఇవి అవసరమా అన్న చర్చ వస్తోంది. దీని కంటే ముందు మరో ప్రశ్న కూడా వస్తోంది. అధికారం దేనికి ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నారు. కక్ష సాధింపుల కోసమా అన్న ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు అని అంటున్నారు.

ఇలా టీడీపీ లీడర్స్ లోకేష్ తదితరులు మాట్లాడడంతోనే ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారంలోకి కక్ష తీర్చుకుంటామని అంటున్నారు. అందుకోసం అధికారం కావాలంట అని సెటైర్లు పేల్చారు. ఇలాంటి కామెంట్స్ ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. మరో వైపు చూస్తే ఇవి పార్టీకి యువ నేత లోకేష్ కి కూడా మంచివి ఏ మాత్రం కావు అనే అంటున్నారు. ఎందుకంటే పార్టీ ప్రజలకు బాధ్యతగా ఉండాలి. ప్రజల సమస్యలకు బాధ్యత తీసుకోవాలి.

నిజమే టీడీపీని వేధించిన వారు ఉండవచ్చు, వారి విషయంలో చట్ట ప్రకారం చర్యలు ఉండాలి తప్ప మరో విధంగా కాదు అన్నది ప్రజాస్వామ్య ప్రియుల భావన. తాట తీస్తాం, తోలు తీస్తాం, కట్ డ్రాయర్లతో పరుగులు పెట్టిస్తామన్న హెచ్చరికలు ఎపుడూ మంచివి కావనే అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అని హుందాగా మాట్లాడితే బాగుంటుంది కదా అన్న సూచనలు వస్తున్నాయి. ఏది ఏమైనా లోకేష్ మాస్ డైలాగ్స్ ఆయనలోని మాస్ అప్పీల్ ని టీడీపీ యువత ఎంజాయ్ చేయవచ్చు కానీ పార్టీ మరో వైపు వైసీపీకి ఆయుధాలను అందిస్తోంది అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

అదే విధంగా ఇలా కక్షలు తీర్చుకోవడానికి లిస్ట్ రెడీ చేసి మరీ బాధ్యత తీర్చుకుంటే ప్రజలు ఒకవేళ అధికారం ఇస్తే అయిదేళ్లూ సరిపోతాయా లోకేశా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయని అంటున్నారు.