'ఆరు శాసన'లతో నారా లోకేష్ ఆశిస్తోందేంటి..!
వాస్తవానికి సిద్ధాంతాలను పక్కన పెట్టి ఆరు శాసనాలను నారాలోకేష్ ప్రతిపాదించలేదు. సిద్ధాంతాలను మరింత బలోపేతం చేసే దిశగానే ఆరు శాసనాలను ఆయన ప్రవచించారు.
By: Tupaki Desk | 29 May 2025 5:00 AM IST43 సంవత్సరాల తెలుగు దేశం ప్రస్తానంలో `శాసనాలు` అంటూ ఏవీ లేవు. కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాయి. సిద్ధాంతాల తోనే పార్టీ ముందుకు సాగుతోంది. పేదలకు సేవ, బీసీలకు ప్రాధాన్యం, మహిళలకు సేవ, వారిని పైకి తీసుకురావడం, తెలుగు ప్రజల అభ్యున్నతి.. అనే ఈ నాలుగు సూత్రాలనే సిద్ధాంతాలుగా మార్చుకుంది. ఈ క్రమంలోనే రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. తెలుగే దేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎన్టీఆర్ తొలిసారి(నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు) ప్రధాని పదవి వచ్చినా వద్దన్నారు.
ఆ తర్వాత. పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కూడా.. ఎన్డీయే కూటమి తొలి నాళ్లలో ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా.. కాదన్నారు. ఈ ఇద్దరు కూడా.. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన పార్టీని తెలుగు ప్రజల సేవకే అంకితం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా.. ఆయా సిద్ధాంతాలకు మాత్రమే ఇద్దరూ పరిమి తం అయ్యారు. కానీ.. తొలిసారి మూడోతరం నాయకుడిగా సాధ్యమైనంత త్వరలోనే పార్టీ పగ్గాలు చేపట్ట నున్ననారా లోకేష్ ఇప్పుడు ఆరుశాసనాలను ప్రతిపాదించారు.
వాస్తవానికి సిద్ధాంతాలను పక్కన పెట్టి ఆరు శాసనాలను నారాలోకేష్ ప్రతిపాదించలేదు. సిద్ధాంతాలను మరింత బలోపేతం చేసే దిశగానే ఆరు శాసనాలను ఆయన ప్రవచించారు. అయితే.. దీని వల్ల నారా లోకేష్ ఆశిస్తున్నది ఏంటి? ఏం చేయాలని అనుకుంటున్నారు? అనేది ప్రశ్నలు. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే.. పార్టీ సిద్ధాంతాలకు.. ప్రస్తుతం ప్రకటించిన ఆరు శాసనాలకు మధ్య పెద్ద తేడా లేదు. అయితే.. వైరుద్యం మాత్రం కనిపిస్తుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సంతరించుకునే దిశగానే నారా లోకేష్ ఈ సూత్రాలను, శాసనాలను ప్రకటించారని చెప్పారు. తెలుగు జాతి-విశ్వఖ్యాతి అనేది.. ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్నదే అయినా.. దీనికి మరిన్ని మెరుగులు దిద్దనున్నారు. ఎన్నారైలను దీనిలో భాగం చేయనున్నారు. ఇక, కొత్తగా వచ్చినవి రెండు అంశాలు. ఒకటి యువగళం, రెండు సోషల్ రీ ఇంజనీరింగ్. ఈ రెండు యువతకు, సామాజిక వర్గాలకు పెద్దపీట వేయనున్నాయి. మొత్తంగా.. ఈ శాసనాల ద్వారా పార్టీని ప్రస్తుతం మారుతున్న యువతకు మరింత కనెక్ట్ చేయడం అనే లక్ష్యాన్ని మాత్రం ప్రతిపాదిస్తోంది.
