Begin typing your search above and press return to search.

లోకేష్ సీఎం కోసం బాబు పొత్తుల నాటకం...!

By:  Tupaki Desk   |   25 Feb 2024 12:30 AM GMT
లోకేష్ సీఎం కోసం బాబు పొత్తుల నాటకం...!
X

తన వారసుడు నారా లోకేష్ సీఎం కావాలన్నది చంద్రబాబు ఆంతర్యం అని సీటు దక్కని వారితో పాటు టీడీపీ పోకడలు చూస్తున్న వారు అంతా అంటున్న మాట. పుత్ర వ్యామోహంతో చంద్రబాబు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. పొత్తులకు వెళ్ళి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి గెలుపు కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు వికటించే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.

నారా లోకేష్ ని సీఎం గా చూడాలని బాబు తాపత్రయపడుతున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు. అందుకే పొత్తుల నాటకానికి తెర తీశారు అని అంటున్నారు. పొత్తుల పేరుతో తెచ్చిన పార్టీలకు కూడా సీట్లు గౌరవప్రదంగా కట్టబెట్టలేదని అంటున్నారు. జనసేనకు గతసారి ఆరు శాతం ఓటు షేర్ వచ్చింది. ఆ పార్టీ ఓటు షేర్ ఈసారి పెరిగింది అని కూడా అంటున్నారు.

మొత్తం 175 సీట్లలో కనీసంగా నలభై దాకా అయినా సీట్లు ఇస్తారని అనుకుంటే కేవలం 24 సీట్లకే పరిమితం చేయడం వెనక లోకేష్ సీఎం అజెండా ఉందని ఆరోపిస్తున్నారు. జనసేనకు సీట్లు ఎక్కువ ఇస్తే రేపటి రోజున అధికారంలో వాటా అడుగుతారని, అది లోకేష్ సీఎం ఆశలను దెబ్బతీస్తుందని భావించే ముందు నుంచి కత్తిరించు కుంటూ వచ్చి చివరికి ఇలా చేశారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీకి కూడా ఏమంత ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం అయితే లేవు అని అంటున్నారు ప్రముఖ సినీ హీరో, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అయిన పవన్ కళ్యాణ్ కే 24 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం వెనక ఒక భారీ వ్యూహం ఉందని అంటున్నారు. జనసేనకే 24 సీట్లు ఇస్తే మీకు అరడజన్ సీట్లే సుమా అని కమలం పార్టీ పెద్దలకు చెప్పడమే అంటున్నారు.

అంటే ఒక జాతీయ పార్టీగా ఉంటూ ఎన్నికల వేళ ఎలక్షనీరింగ్ కి బీజేపీ తోడు కావాలి కానీ ఆ పార్టీకి కనీసం గౌరవప్రదమైన సీట్లు ఇచ్చేందుకు కూడా టీడీపీకి సమ్మతి లేదు అని అంటున్నారు. అందుకే జనసేనను చూపించి బీజేపీతో సీట్ల విషయం బేరాలు ఆడాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే సీట్లు దక్కిన వారు కూడా డబ్బున్న వారు అని అంటున్నారు. దీని మీద సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందు చూస్తూండగానే రాజకీయం ఇలా తయారైంది అని అంటున్నారు. డబ్బు ఉన్న వారిదే రాజకీయం అని ఆయన చెప్పడం బట్టి చూస్తే పెద్దాయన ఎంతలా కలత చెంది ఉంటారో అని అంటున్నారు.

ఆయన ఒక్కరే కాదు చాలా మంది ఇలాగే ఉన్నారు. తమ చేత అయిదేళ్ల పాటూ పని చేయించుకుని ఇంచార్జి పదవులు ఇచ్చి తీరా టికెట్లు మాత్రం తాము అనుకున్న వారికే కట్టబెడుతున్నారని ఇదంతా పొత్తు ఎత్తుల రాజకీయం దీని వెనక లోకేష్ సీఎం ని చేసే వ్యూహం ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ జాబితా చూసిన సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.