Begin typing your search above and press return to search.

చంద్రబాబును 'పెద్దాయన' చేస్తున్న టీడీపీ!

టీడీపీ అధినేత, ఉమ్మడి ఏపీ, విభజత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 40 రోజులుగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 2:45 AM GMT
చంద్రబాబును పెద్దాయన చేస్తున్న టీడీపీ!
X

టీడీపీ అధినేత, ఉమ్మడి ఏపీ, విభజత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 40 రోజులుగా ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయిన ఆయన.. దసరా పండుగను సైతం జైలులోనే గడపాల్సి వస్తోంది. అయితే, కీలకమైన ఎన్నికల సమయంలో అధినేత జైలు పాలు కావడం టీడీపీ శ్రేణులకు శరాఘాతమైంది. వాస్తవానికి చంద్రబాబు గనుక ప్రస్తుత సమయంలో ప్రజా క్షేత్రంలో ఉండి ఉంటే వివిధ అంశాలపై ఏపీ సర్కారును నిలదీస్తూ ఉండేవారు. అరెస్టుకు ముందు వరకే బస్సు యాత్ర చేపట్టిన ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాంటి యాత్ర సమయంలోనే ఓ సందర్భంగా తన అరెస్టును చంద్రబాబు ప్రస్తావించారు. చివరకు ఆయన ఊహించినంతా జరిగింది. కాగా, తండ్రి అరెస్టు అనంతరం టీడీపీ యువ నేత లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చి.. కొన్నాళ్లు ఢిల్లీలో ఉన్నారు.

చంద్రబాబు చుట్టూనే

టీడీపీ అధినేత చంద్రబాబు బయట ఉండి ఉంటే ఏపీ సర్కారుకు సంబంధించి వివిధ అంశాలపై పార్టీ శ్రేణులను ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు సమాయత్తం చేసేవారు. అందులోనూ ఎన్నికల వేల కాబట్టి చంద్రబాబు తన కార్యాచరణను మరింత వేగిరం చేసేవారు. కాగా, ఆయన జైలులో ఉన్న నేపథ్యంలోనూ టీడీపీ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అవి కేవలం చంద్రబాబు చుట్టూరానే జరుగుతున్నాయి. అంటే.. వైసీపీ సర్కారు నిర్ణయాలు, వైఫల్యాల మీద చేపట్టాల్సిన ఆందోళనలు, చంద్రబాబు అరెస్టుకు నిరసనగానో, విడుదల కోరుతూనో జరుగుతున్నాయన్నమాట.

కొవ్వొత్తుల ప్రదర్శన.. నిజం గెలవాలి

చంద్రబాబు అరెస్టు జరిగిన తొలి రోజుల నుంచే టీడీపీ వివిధ రూపాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. డప్పులు మోగించడం.. కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన.. తదితరాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ నుంచి సైతం లోకేశ్ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇలాంటి ఆందోళనల్లో భాగంగానే.. ఈ నెల 25న ‘‘నిజం గెలవాలి’’ పేరిట చంద్రబాబు సతీమణి భువనేశ్వరి యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారానికి మూడులు ఇంటింటికి వెళ్లనున్నారు. సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. రాయలసీమ కోడలిగా భువనేశ్వరి రాయలసీమ జిల్లాల్లోనే తొలుత పర్యటన చేపట్టనున్నారు. నిజం గెలవాలి యాత్రను 25న చంద్రగిరిలో ప్రారంభిస్తారు.

పాటలు కడుతూ.. పాలనను కీర్తిస్తూ

చంద్రబాబుది అక్రమ అరెస్టు అనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం. దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ, చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా? అని పార్టీ కేడర్ ఎదురుచూస్తోంది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ ఇన్ని రోజులు కార్యకర్తలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా లేరు. నిత్యం కేడర్ తో టచ్ లో ఉంటూ వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన మార్గనిర్దేశం కరువై కేడర్ ఆవేదనలో ఉంది. కాగా, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, భువనేశ్వరికి మద్దతు తెలుపుతూ ‘చివరికిలా తీర్చుకుందా తెలుగు నేల నీ రుణం’ పేరుతో రూపొందించిన టీడీపీ నాయకురాలు, కృష్ణా జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ పాటను రూపొందించారు. ఇది అచ్చంగా చంద్రబాబు పాలనను కీర్తిస్తూ, నాయకత్వ లక్షణాలను పొగుడుతూ, దార్శనికతను ప్రశంసిస్తూ సాగింది. శ్రేణులను భావోద్వేగానికి గురి చేస్తోంది. ‘తండ్రిలాగా తపనపడి నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేసినందుకేనా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు’ అని ఈ పాటలో ప్రశ్నించారు.

పెద్దాయనను చేసేస్తున్నారు..

వరుస కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ప్రతిఘటిస్తున్న టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు ఆయనపై పాటలు కడుతూ కీర్తిస్తూ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా 73 ఏళ్ల చంద్రబాబును పెద్దాయనను చేస్తున్నాయి. వాస్తవానికి దేశంలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. 45 ఏళ్ల పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి.. క్రియాశీల రాజకీయల్లో కొనసాగుతున్న నేతలు చంద్రబాబు సహా నలుగురైదుగురే ఉన్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టును సానుభూతి పవనంగా మార్చుకునేందుకు టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టుపై పాటలు కడుతూ కీర్తిస్తూ ‘‘పెద్దాయన’’ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.