Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట డ్రామాలు... అవేనా టీడీపీ లక్ష్యాలు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు గడిచిన 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2023 9:01 AM GMT
చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట డ్రామాలు... అవేనా టీడీపీ లక్ష్యాలు?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు గడిచిన 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ సమయంలో భోజనం, మందులూ ఇంటి నుంచే అందిచేలా కోర్టును కోరారు కుటుంబ సభ్యులు. అందుకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఆ కార్యక్రమం జరుగుతుంది!

ఇక జైలుకి వెళ్లిన అనంతరం చంద్రబాబు ఉదయాన్నే లేవడం, కాసేపు యోగా చేసుకోవడం, న్యూస్ పేపర్ రీడింగ్, ఈలోపు ఇంటి నుంచి వచ్చిన బ్లాక్ కాఫీ, బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది ఉదయం పూట దినచర్య అని చెబుతున్నారు. అనంతరం మధ్యాహ్నం ఇంటినుంచి వేడి వేడి భోజనం.. భోజనం అనంతరం వేసుకునే మందులు అందుతాయి. ఇక ఈవినింగ్ రోటీలు, ఆకుకూర కర్రీ డిన్నర్ గా తీసుకుంటారని చెబుతుంటారు.

కాకపోతే మొదట్లో కాస్త దోమలు ఎక్కువగా ఉన్నాయని ములాకత్ అనంతరం ఫ్యామిలీ మెంబర్స్ ఫిర్యాదు చేశారు. దీనిపై జైలు అధికారులు వివరణ ఇచ్చారు. రెండు పూటలా దోమల మందు పిచికారీ చేస్తున్నామని అన్నారు. దోమ లార్వా ఎక్కడా నిల్వలేదని చెప్పారు. అనంతరం లోకేష్ మరింత హడావిడి చేశారు! దోమలతో కుట్టించి డెంగ్యూ తెప్పించి చంద్రబాబుని చంపాలని చూస్తున్నారని అన్నారు. దీంతో ఇదోరకం వితండవాదం అనే కామెంట్లు వినిపించాయి.

అనంతరం అలాంటి ఫిర్యాదులేమీ పెద్దగా రాలేదు. ఒకసారి ఏసీ లేదని మాత్రం తెలిపారు. అనంతరం దానిపై పెద్దగా మాట్లాడింది లేదు. ఇదే సమయంలో ఇటీవల ములాకత్ లో కలిసిన భువనేశ్వరి.. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, ధైర్యంగా పోరాడమన్నారని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల గురించే ఆయన బెంగ అంతా అని చెప్పుకొచ్చారు!

కట్ చేస్తే... కేంద్రంలోని పెద్దల వద్ద సానుభూతి కోరుకుంటున్నారో.. లేక, సుప్రీంకోర్టు విచారణలో భాగంగా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారో తెలియదు కానీ... చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురూ ఒకేసారి (ఇంగ్లిష్ లో) ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్య సహాయం అవసరమని తెలిపారు. బాబు అరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్తవానికి జరిగిందేమిటి...? గురువారం సాయంత్రం కాస్త శరీరం దురద పెడుతుందని, స్కిన్ అలర్జీలాగా వచ్చిందని, విపరీతంగా కాస్తున్న ఎండలవల్ల వస్తోన్న వేడే కారణం అని, బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుందని చంద్రబాబు జైలు అధికారులకు తెలిపారంట. దీంతో అప్రమత్తమైన అధికారులు... హుటాహుటున రాజమండ్రి జీజీహెచ్ నుంచి స్కిన్ స్పెషలిస్ట్ వైద్యులను పిలిపించి ట్రీట్ మెంట్ ఇప్పించారు.. మందులు రాసి ఇచ్చారు.

అనంతరం గురువారం రాత్రి... చంద్రబాబు హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు. అందులో... బాబు ఆరోగ్యంగానే ఉన్నారని.. హార్ట్ బీట్, బీపీ, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. దీంతో... చంద్రబాబు ఆరోగ్యం నిలకడ ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారని కథనాలొచ్చాయి.

అయితే ఉన్నపలంగా శుక్రవారం ఉదయం కొంతమంది టీడీపీ నాయకులు, చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురూ... ఆయన ఆరోగ్యంపై రచ్చ చేయడం మొదలుపెట్టారు. బాబుకు అత్యవసర వైద్య సేవలు అవసరమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తన భర్త 5 కిలోల బరువు తగ్గిపోయారని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇక అతిగా స్పందించడానికి అలవాటు పడిపోయారో.. లేక, అలా స్పందిస్తేనే మీడియా అటెన్షన్ వస్తుందని భావించారో తెలియదు కానీ... ఇదే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. తన తండ్రికి స్టెరాయిడ్స్ ఎక్కించాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందంటూ ట్వీట్ చేశారు. పోలీసులు, ప్రభుత్వ వైద్యులు వాస్తవాలు దాస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై జైళ్ల డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గడమేమిటి... జైలుకి వచ్చాక కిలో బరువు పెరిగారని క్లారిటీ ఇచ్చారు. అవును... జైలుకి వచ్చినప్పుడు 66 కిలోలున్న బాబు బరువు, ఇప్పుడు 67 కిలోలుగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో... బాబు ఇంటినుంచి భోజనం తెప్పించి, జైలు అధికారులు తిన్నతర్వాతే ఆయనకు పెడుతున్నామని అన్నారు.

వాస్తవాలు అలా ఉంటే... ఉన్నపలంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు ట్విట్టర్లో.. బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో... జైలు అన్నాక అందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి.. అయితే చంద్రబాబు వయసు, హోదా దృష్ట్యా చాలా కంఫర్ట్స్ కలిగించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సందిస్తున్నారు పరిశీలకులు.

ఎండలైనా, ఉక్కపోతైనా... జైలులో అయినా, ఇంటిలో అయినా ఒకే విధంగా ఉంటాయి కదా... అలాంటప్పుడు ఎండ ఎక్కువగా ఉందని బయటకు పంపాలని, బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారా ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో వాతావరణ పరిస్థితుల ఆధారంగా బెయిల్స్ ఇచ్చుకుంటూపోతే దేశంలోని జైళ్లలో ఎంతమంది మిగిలి ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వ వైద్యులు, ఎక్స్ పర్ట్ లు చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని పరీక్షించి చెబుతుంటే... జైలు బయట ఉన్న టీడీపీ నేతలు మాత్రం.. జైల్లో బాబు ఆరోగ్యం బాగాలేదని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఇక.. ములాకత్ లో బాబుని కలిసి మాట్లాడివచ్చిన భువనేశ్వరి.. ఆయన బరువు 5 కిలోలు తగ్గారని కచ్చితంగా చెబుతున్నారు. అదేలా చెప్పగలిగారనే ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటే... జైలుకొచ్చాక బాబు బరువు పెరిగారని అధికారులు చెక్ చేసి క్లారిటీ ఇచ్చారు.

మొన్న ములాకత్ లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు.. ధైర్యంగా పోరాడమన్నారు అని చెప్పిన భువనేశ్వరి... రెండు రోజుల్లోనే బాబు బరువుపై కచ్చితంగా తెలిసినట్లుగా, తూచినట్లుగా చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అనేది మరోప్రశ్న! ఇక తాజాగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు శుభ్రంగా లేవని చెప్పుకొచ్చారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తామని అధికారులు చెబుతున్నారని అంటున్నారు. కారణం.... జైలులో వేల మంది ఖైదీలు, అన్ని వయసుల వారూ ఉంటారు! అందరీ ఆరోగ్య బాధ్యత జైలు అధికారులదే కదా!

మరో విషయం ఏమిటంటే... భారతదేశంలో కోట్లాది మంది ప్రజానికానికి మంచినీటి సరఫరా అదే పద్దతిలో జరుగుతుంటుంది. రాజమండ్రి జైలులో కూడా గతకొన్ని దశాబ్ధాలుగా అదే పద్దతిలో తాగునీటి సరఫరా అవుతుంది కదా? ఇది ఏమాత్రం లాజిక్ లేని ఆరోపణ అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఏదైనా ఉంటే... కోర్టు పరిధిలో చూసుకోవాలి కానీ... ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి, ప్రభుత్వం పైన, వ్యవస్థలపైనా బురద చల్లాలని అనుకుంటే... ఫలితంగా చట్టం నుంచి తప్పించుకోవచ్చనుకుంటే అంతకు మించిన అనాలోచిత చర్య, అమాయకపు చర్య మరొకటి ఉంటుందా అనేది నిపుణుల అభిప్రాయంగా ఉంది.