Begin typing your search above and press return to search.

మరో టాస్కు ఇచ్చిన నారా బ్రాహ్మణి.. ఈసారి లైట్లు ఆపేయాలట

తాజాగా మరో టాస్కును ఇచ్చారు బ్రాహ్మణి. తాజాగా ట్వీట్ పిలుపునిచ్చిన ఆమె.. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని అనుకునే కొందరికి.

By:  Tupaki Desk   |   6 Oct 2023 12:15 PM GMT
మరో టాస్కు ఇచ్చిన నారా బ్రాహ్మణి.. ఈసారి లైట్లు ఆపేయాలట
X

స్కిల్ స్కాం ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం జైల్లో కాలం గడుపుతున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు దన్నుగా నిలుస్తామని చెబుతూ.. టాస్కుల మీద టాస్కుల్ని ఇస్తున్నారు నారా బ్రాహ్మణి. మొన్నటికి మొన్న గంటలు మోగించాలని.. ప్లేట్ల మీద దరువు వేయటం ద్వారా.. చంద్రబాబు అరెస్టు తప్పన్న విషయాన్ని ప్రపంచానికి చాటాలంటూ పిలుపునివ్వటం తెలిసిందే. తాజాగా మరో టాస్కును ఇచ్చారు బ్రాహ్మణి. తాజాగా ట్వీట్ పిలుపునిచ్చిన ఆమె.. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని అనుకునే కొందరికి.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని పేర్కొంటూ దీపాల్ని వెలిగించాలంటూ ట్వీట్ పిలుపిచ్చారు బ్రాహ్మణి.

అక్టోబరు 7న (శనివారం) రాత్రి 7 గంటల వేళలో ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి.. ఐదు నిమిషాల పాటు దీపాలు.. సెల్ ఫోన్లు.. టార్చ్.. కొవ్వొత్తులు వెలిగిద్దామని.. ఒకవేళ రోడ్ల మీద వాహనాలతో ఉంటే లైట్లు బ్లింక్ చేద్దామన్న పిలుపునిచ్చారు బ్రాహ్మణి. "మన రాష్ట్రాన్ని.. మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదనుకుంటున్నారు. కానీ.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు.. మనమెందుకు చీకట్లో ఉండాలి" అంటూ పిలుపునిచ్చిన బ్రాహ్మణి.. ఇళ్లల్లో వెలుగుతున్న దీపాల్ని ఆర్చేసి.. వీధుల్లోకి వచ్చి లైట్లు వెలిగించాలని పేర్కొనటం గమనార్హం.

తాజాగా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపునకు సంబంధించిన ట్వీట్ చూసినోళ్లంతా మోడీని ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు. కరోనా విపత్తు వేళ.. ప్రజలకు ఏదో ఒక టాస్కును ఇవ్వటం తెలిసిందే. మొదట్లో గంట మోగించాలని.. ఆ తర్వాత లైట్లు ఆపేసి.. దీపాలు వెలిగించాలంటూ వరుస పెట్టి ఇచ్చిన పిలుపులు ఫార్సుగా మారటం తెలిసిందే. బ్రాహ్మణి పిలుపుల ట్వీట్లు అదే తీరులో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.