మహానాడు ఈసారి ప్రత్యేకం...ఆయనే సూపర్ అట్రాక్షన్
ఇంకో వైపు టీడీపీకి కలిసొచ్చే కాలానికి ఎదిగొచ్చిన వారసుడిగా కళ్ళ ముందు లోకేష్ కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 27 May 2025 4:09 PM ISTమహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్నో నిర్వహించింది. ఆ పార్టీ 1983లో అధికారంలోకి రావడంతోనే అదే ఏడాది తొలిసారి జరిపింది. ఆ తరువాత మహానాడు ఉమ్మడి ఏపీలో ప్రతీ ఏటా ప్రతీ చోటా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈసారి మహానాడు టీడీపీకి ప్రత్యేకమని చెబుతున్నారు.
దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వయసు ఈ రోజు అక్షరాలా 43 ఏళ్ళు. అంటే ఒక ప్రౌఢ అన్న మాట. నడివయసులోకి వచ్చిన పార్టీ అన్న మాట. ఇక ఈసారి టీడీపీ కూటమి కట్టి చరిత్రలో ఎరగని విధంగా అత్యధిక సీట్లను గెలుచుకుంది. కేంద్రంలో ఎంతో అనుకూలమైన ప్రభుత్వం ఉంది. ఇక బలమైన ప్రభుత్వం ఏపీలో నడుపుతోంది. బలహీనమైన ప్రతిపక్షం ఉంది. ఒక విధంగా ఏపీలో కూటమిది అంతా ఏకపక్షంగానే ఉంది అని చెప్పాలి.
ఇంకో వైపు టీడీపీకి కలిసొచ్చే కాలానికి ఎదిగొచ్చిన వారసుడిగా కళ్ళ ముందు లోకేష్ కనిపిస్తున్నారు. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఆయనని చూసి విపక్షాలు గేలి చేసేవి. పప్పు అని పేరు పెట్టి విమర్శించేవి. అయితే దానిని ఒక సవాల్ గా తీసుకున్న లోకేష్ తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగారు. అలా ఆయన 2019 నుంచి 2024 మధ్యలో చాలా ఎదిగారు. తన నాయకత్వ పటిమను పెంచుకున్నారు. యువగళం పాదయాత్రతో జనంలోనూ పార్టీ జనంలోనూ పట్టు సాధించారు.
దాంతో లోకేష్ భవిష్యత్తు నాయకుడు అన్న భావన టీడీపీలోనూ ఏపీలోనూ బలంగా ఏర్పడింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న మహానాడు నారా లోకేష్ కి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పాలి. నారా లోకేష్ ఈసారి మహానాడులో అతి ముఖ్య ఆకర్షణగా కనిపిస్తున్నారు. సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీదనే అందరి దృష్టి ఉంటుంది. ఆయన ప్రసంగం కోసమే అంతా చూస్తారు.
కానీ ఈసారి మహానాడులో పూర్తిగా లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. నాయకులు అంతా తమ ప్రసంగాలలో లోకేష్ గురించే ఎక్కువగా చెబుతున్నారు. ఆయన నామ స్మరణే చేస్తున్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అయితే భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని స్పష్టం చేశారు. ఆయనలో పట్టుదలను పనిచేసే తత్వాన్ని తాను దగ్గర ఉండి చూశాను అని అన్నారు.
అదే తీరున అనేకమంది నాయకులు అంతా కూడా లోకేష్ నే కీర్తిస్తూ ఉపన్యసించారు. సీనియర్లు దీవిస్తూంటే జూనియర్లు జై కొడుతున్న సన్నివేశమే టీడీపీ మహానాడులో కనిపిస్తోంది. ఇప్పటిదాకా వన్ మ్యాన్ షోగా టీడీపీని నడిపిన కూడా ఈసారి కొంత రిలాక్స్ గా మహానాడు వేదిక మీద కనిపించారు. ముప్పయ్యేళ్ళుగా తాను మోస్తున్న బరువు బాధ్యతలను అందుకోవడానికి తనదైన సమర్ధత చూపిస్తూ లోకేష్ అంది వచ్చారన్న ఆనందం అయితే బాబులో కనిపిస్తోంది.
లోకేష్ సైతం పెద్దల పట్ల వినయం ప్రదర్శిస్తూ కార్యకర్తలను ఆకాశానికి ఎత్తుతూ తన ప్రసంగం చేశారు. కార్యకర్తను తాను గుండెలలో పెట్టుకుంటాను అని వారి మనసు దోచుకున్నారు. టీడీపీకి కార్యకర్త మాత్రమే అధినేత అని లోకేష్ చెప్పిన తీరుతో లక్షలాది మంది కార్యకర్తలు ఫిదా అయిన సన్నివేశం కనిపిస్తోంది.
గతానికి భిన్నంగా లోకేష్ అద్భుతమైన ప్రసంగం చేశారనే చెప్పాలి. ఆయన ఉత్సాహపూరితంగా కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం క్యాడర్ కి కొత్త జోష్ ఇచ్చింది. లోకేష్ స్పీచ్ కి అడుగడుగునా క్యాడర్ చప్పట్లు కొట్టింది అంటే ఆయన లీడర్ షిప్ కి వారు ఘన స్వాగతం పలికినట్లే అంటున్నారు.
గతానికి ఈసారికి భిన్నంగా లోకేష్ ఒక బలమైన నాయకుడిగా క్యాడర్ ముందు నిలబడ్డారు. దాంతో ఆయనకు మొత్తం టీడీపీ పార్టీలో పూర్తి స్థాయి మద్దతు లభిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ వారసుడు అన్న ట్యాగ్ ని ఎంతో సమర్ధంగా వ్యవహరించి లోకేష్ అందుకోబోతున్నారు అనే చెప్పాల్సి ఉంది. ఇదంతా ఆయన తన కృషితో సాధించినది అని అంటున్నారు.
