Begin typing your search above and press return to search.

'కార్యకర్తే అధినేత' అమెరికాలో లోకేశ్ అదిరిపోయే స్పీచ్

తెలుగుదేశం పార్టీకి అమెరికాలో సైతం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఎన్ఆర్ఐలు తీవ్రంగా కృషి చేశారు.

By:  Tupaki Political Desk   |   7 Dec 2025 2:18 PM IST
కార్యకర్తే అధినేత అమెరికాలో లోకేశ్ అదిరిపోయే స్పీచ్
X

టీడీపీ యువనేత, పార్టీ భావి అధినేత లోకేశ్ అమెరికా పర్యటన ఉత్సాహంగా మొదలైంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి డల్లాస్ లో స్వాగతం పలకడంపై మంత్రి లోకేశ్ పులకించిపోయారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా, కార్యకర్తలు చూపే ప్రేమాభిమానాలు, వారిచ్చే ధైర్యం తమ కుటుంబం ఎప్పటికీ మరచిపోదని లోకేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గార్లాండ్ లో జరిగిన సభలో వేలాది మంది సాక్షిగా కార్యకర్తల త్యాగాలను పేరుపేరునా ప్రస్తావించడం ఆకట్టుకుందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి అమెరికాలో సైతం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఎన్ఆర్ఐలు తీవ్రంగా కృషి చేశారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు సమయంలో అమెరికాలోని తెలుగు ప్రవాసులు చేసిన ఆందోళనలు రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపాయి. తమ జీవితాలను తీర్చిదిద్దిన చంద్రబాబును అరెస్టు చేసి జైలులో వేశారన్న కోపంతో రగిలిపోయిన ప్రవాసులు ఎన్నికల సమయంలో సొంత ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి టీడీపీ కూటమికి ఓటేశారు. చాలామంది ఉద్యోగాలకు రెండు మూడు నెలలు సెలవులు పెట్టిమరీ ప్రచార కార్యక్రమాల్లో మమేకయ్యారు.

ఇలా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పేందుకు 18 నెలల అనంతరం లోకేశ్ ప్రత్యేకంగా అమెరికా వెళ్లారు. ఇక లోకేశ్ ను కలవడానికి పెద్ద సంఖ్యలో గార్లాండ్ కు తెలుగు ప్రవాసులు తరలివచ్చారు. ఆ సమావేశాన్ని చూస్తే ఏపీలో ఏదో ఒకపట్టణంలో జరిగే బహిరంగ సభను తలపించింది. దీంతో లోకేశ్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ఇంతలా అభిమానం చూపిస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేదని వ్యాఖ్యానించారు.

ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్న ఎన్టీఆర్ అన్నా, పసుపు జెండా అన్నా ఒక ఎమోషన్ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలు బాగా కనెక్ట్ అయ్యాయి. పార్టీలో ఎందరో నేతలు వస్తుంటారు, పోతుంటారు కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ అలా ఉండిపోతారంటూ వారి త్యాగాలను గుర్తు చేశారు. పీకపై కత్తిపెట్టినా జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య, నుదిటిపై గాయం చేసినా చివరి ఓటు వరకు ఎదురుచూసి రక్తం కారుతున్నా పార్టీ కోసం పోరాడిన మంజులా రెడ్డి, పుంగనూరులో తొడగొట్టిన అంజిరెడ్డి తాత, విజయవాడలో కన్ను పోగొట్టుకున్న గాంధీ వంటి కార్యకర్తలే తనకు స్ఫూర్తి అంటూ లోకేశ్ వెల్లడించారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు.