ఉచిత బస్సుల్లో తిరగండి.. కానీ, ఇలా చేయండి: మహిళలకు లోకేష్ పిలుపు
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' పథకం కింద అందుబాటులోకి వచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను మహిళలు జోరుగా వినియోగించుకుంటున్నారు.
By: Garuda Media | 16 Aug 2025 11:31 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' పథకం కింద అందుబాటులోకి వచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను మహిళలు జోరుగా వినియోగించుకుంటున్నారు. శనివారం సాయంత్రానికి 99 శాతం మేరకు ఉచిత బస్సులు పూర్తిగా మహిళలతోనే నిండిపోయాయని అధికారులు తెలిపారు. ఎక్కడ చూసినా.. మహిళా ప్రయాణికులే కనిపించారని ఆర్టీసీ వర్గాలు తెలిపారు. పురుష ప్రయాణికుల కంటే మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను దృష్టిలో పెట్టుకుని, వారికి సాధికారత కల్పించేఉద్దేశంతోనే ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంకా ఎంతమందైనా ఫ్రీ బస్సులలో ప్రయాణించ వచ్చన్నారు. త్వరలోనే కొత్త బస్సులు కూడారానున్నాయని, వాటిని కూడా స్త్రీ శక్తి పథకానికే కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. ఉచిత బస్సులను మహిళల కోసమే తెచ్చామన్న ఆయన.. వాటిని సాధ్యమైనంత వాడుకోవాలని సూచించారు. అయితే.. ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్న మహిళలకు ఆయన ఓసూచన చేశారు.
వారు ఫ్రీ బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణించినా.. `జీరో ఫేర్`తో కండెక్టర్లు ఇచ్చే టికెట్లు తీసుకుని.. వాటితో తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. వీటిని సోషల్ మీడియాలో `ఫ్ర బస్సు టికెట్` అని హ్యాష్ ట్యాగ్ చేయాలని ఆయన సూచించారు. తద్వారా మరింత మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహిళలకు గౌరవంతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ పథకం.. వారిలో ఆత్మాభిమానాన్ని మరింత రెట్టింపు చేస్తుందన్నారు. ఉచిత బస్సు టికెట్ .. మహిళల స్వేచ్ఛ, గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. జీరో ఫేర్ టికెట్లతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు.
