లోకేశ్ బిగ్ ప్లాన్.. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో ప్రత్యేక భేటీ
బుధవారం ఉప రాష్ట్రపతి జగదీప్ దనఖడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 19 Jun 2025 2:00 PM ISTరాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు కొద్దిరోజుల ముందు దేశ రాజధానికి వచ్చిన మంత్రి లోకేశ్ పలువురు జాతీయ నేతలను కలుస్తున్నారు. మరోవైపు విదేశీ నేతలతోనూ ఆయన భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఏకంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా లోకేశ్ తో భేటీకి ఆసక్తిచూపడాన్ని టీడీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా లోకేశ్ పరపతి పెరిగింది అనడానికి టోనీ బ్లెయిర్ తో మీటింగ్ ఉదాహరణ అంటున్నారు.
బుధవారం ఉప రాష్ట్రపతి జగదీప్ దనఖడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ అయ్యారు. అదేవిధంగా చిరాగ్ పాశ్వాన్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తోనూ మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై వారితో చర్చించారు. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన పాదయాత్ర యువగళంపై రూపొందించిన పుస్తకాన్ని వారికి అందజేశారు.
ఇక గురువారం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తోనూ లోకేశ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ అంతర్జాతీయ నేతతో రాష్ట్రస్థాయిలో పదవిలో ఉన్న నేత భేటీ కావడం విశేషంగా పరిశీలకులు చెబుతున్నారు. టోనీ బ్లెయిర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) వ్యవస్థాపకుడు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై టోనీ బ్లెయిర్ తో లోకేశ్ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో టోనీ బ్లెయిర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారు. ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దుతు కోసం గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెర్స్ స్థాపనకు టీబీఐ సహకరిస్తుందని అంటున్నారు.
టోనీబ్లెయిర్ సంస్థ అనేక విషయాల్లో రాష్ట్రానికి సహకరించేలా ఒప్పందం కుదరిందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతు ఇవ్వనుందని చెబుతున్నారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ లో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేశ్ కోరారు. ఆగస్టులో విశాఖలో నిర్వహించనున్న విద్య శాఖ మంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ వెల్లడించారు.
