Begin typing your search above and press return to search.

దేవుడు వారిని వ‌దిలి పెట్ట‌డు: లోకేష్ ఆగ్ర‌హం

దేవుడంటే గ‌త పాల‌కుల‌కు ఏమాత్రం లెక్క‌లేద‌న్నారు. తిరుమ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా.. డిక్ల‌రేష‌న్‌పై ఎలాంటి సంత‌కం చేయ‌లేద‌ని మంత్రి గుర్తు చేశారు.

By:  Garuda Media   |   4 March 2026 6:01 PM IST
దేవుడు వారిని వ‌దిలి పెట్ట‌డు:  లోకేష్ ఆగ్ర‌హం
X

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్ర‌సాదాన్ని అప‌విత్రం చేసిన వారిని దేవుడు వ‌దిలి పెట్ట‌బోడ‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శాస‌న మండ‌లిలో ల‌డ్డూ ప్ర‌సాదంపై చ‌ర్చ జ‌రిగిన నేప‌థ్యంలో ఆయ‌న కూడా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా దేవుడిపై త‌మ‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అందుకే తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌ని తెలియ‌గానే.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య ఆ విష‌యాన్ని వివ‌రించార‌ని చెప్పా రు. ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిపై ఉంద‌న్నారు.

దేవుడంటే గ‌త పాల‌కుల‌కు ఏమాత్రం లెక్క‌లేద‌న్నారు. తిరుమ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా.. డిక్ల‌రేష‌న్‌పై ఎలాంటి సంత‌కం చేయ‌లేద‌ని మంత్రి గుర్తు చేశారు. కానీ.. గ‌తంలో అనేక మంది ఇత‌ర విశ్వాసులు తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు వారు.. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేశార‌న్నారు. దేవుడిపై ఎవ‌రికి న‌మ్మ‌కం ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పారు. తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ అయింద‌ని.. సీబీఐ ప‌దే ప‌దే పేర్కొంద‌ని.. ఈ విష‌యం తెలిసి కూడా వైసీపీ స‌భ్యులు నెపం త‌మ‌పై వేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

వైసీపీ స‌భ్యులు.. ల‌డ్డూ క‌ల్తీ అంశాన్ని వ‌దిలేసి.. ఏవేవో వ్యాఖ్య‌లు చేస్తున్నారని లోకేష్ విమ‌ర్శించారు. నెయ్యి ధ‌ర‌లు ప్ర‌స్తుతం పెరిగాయ‌ని.. ఆమేర‌కు తిరుమ‌ల‌కు నెయ్యి ధ‌ర‌లు పెంచి స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని తెలిపారు. వాళ్ల మాదిరిగా తాము కూడా కల్తీ చేసిన నెయ్యి వాడాలా? అని ప్ర‌శ్నించారు. ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగింద‌ని.. గ‌తంలో టీటీడీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించిన వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీక‌రించార‌ని తెలిపారు. ఢిల్లీలో స్వ‌యంగా మీడియాతోనే వైవీ ఈ విష‌యాన్ని చెప్పార‌ని తెలిపారు.

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ చేసిన వారిని.. ఈ క‌ల్తీతో వ‌చ్చిన సొమ్మును దోచుకున్న వారిని కూడా ఆ దేవ‌దేవుడు వ‌దిలి పెట్ట‌బోడ‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ల‌డ్డూలో క‌ల్తీనెయ్యి వినియోగించార‌న్న‌ది నూటికి నూరుపాళ్లు వాస్త‌వ‌మ‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా త‌ప్పు ఒప్పుకొని తీరాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాగా.. లోకేష్ మాట్లాడుతున్న స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ప‌దే ప‌దే స‌భ‌కు కొంత అంత‌రాయం క‌లిగింది.