Begin typing your search above and press return to search.

అమ్మ కొట్టేది.. నాన్న తిడుతున్నారు.. లోకేశ్ సరదా కబుర్లు

నిత్యం అధికారిక బాధ్యతల్లో బిజీబిజీగా ఉండే మంత్రి లోకేశ్ అప్పుడప్పుడు తనలో సరదా మనిషిని ఆవిష్కరిస్తుంటారు.

By:  Tupaki Political Desk   |   21 July 2026 3:43 PM IST
అమ్మ కొట్టేది.. నాన్న తిడుతున్నారు.. లోకేశ్ సరదా కబుర్లు
X

నిత్యం అధికారిక బాధ్యతల్లో బిజీబిజీగా ఉండే మంత్రి లోకేశ్ అప్పుడప్పుడు తనలో సరదా మనిషిని ఆవిష్కరిస్తుంటారు. తన చిన్నతనంలో జరిగిన విషయాల నుంచి తాజాగా రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న అనుభవాలను బహిరంగ వేదికలపై పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా తల్లికి వందనం పథకంపై మహిళలతో ముచ్చటించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. తన సొంత నియోజకవర్గం మంగళగిరికి చెందిన కొందరు మహిళలతో ఒక పాఠశాల ఆవరణలో మంత్రి లోకేశ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మహిళలతో అనేక విషయాలపై చర్చించిన మంత్రి తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

తల్లికివందనం పథకం కింద ఈ నెల 22 తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు బహిరంగ సమావేశాలు నిర్వహించి పథకం వివరాలను తెలియజేస్తుంటారు. కానీ, మంత్రి లోకేశ్ వినూత్నంగా ఆలోచించారు. వేల మందితో సభ నిర్వహణ కన్నా, పది మందితో ప్రత్యేకంగా మాట్లాడి విస్తృత ప్రచారం చేయాలని భావించారు. మంగళగిరికి చెందిన కొందరు మహిళలతో ముచ్చటించి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వంలో నెంబర్ 3 స్థానంలో ఉన్నప్పటికీ మహిళలతో కలిసి నేలపై కూర్చుని అనేక విషయాలపై చర్చించారు. ఆ సమయంలో పిల్లల పెంపకం నుంచి మహిళల గౌరవం వరకు అనేక అంశాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో తల్లికివందనం పథకం ఎందుకు అమలు చేస్తున్నాం? ఈ సంవత్సరం ఒక నెల ఆలస్యంగా డబ్బులు విడుదల చేయడానికి కారణాలు ఏంటి అన్న వివరాలను మంత్రి సందర్భోచితంగా వివరించిన తీరు విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లు కొనసాగుతుండగానే తన వ్యక్తిగత జీవితంపై మంత్రి లోకేశ్ సరదా కబుర్లు చెప్పి ఆకట్టుకున్నారు.

పిల్లలను గారాభంగా పెంచాలని అనుకోవడంలో తప్పులేదని, కానీ వారికి తల్లిదండ్రుల కష్టనష్టాలు కూడా తెలియాలి అంటూ లోకేశ్ సూచించారు. ఇదే సమయంలో తమ కుమారుడు దేవాన్ష్ కు ఏటా మూడు రోజులు తమ సొంతూరు తీసుకువెళతామని ఆ సమయంలో తమ కుటుంబ సంస్థ అయిన డెయిరీ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి కార్మికుల కష్టసుఖాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అంతేకాకుండా తమ కుటుంబంలో అందరూ రకరకాల పనులపై బిజీగా ఉంటారని కానీ, వారంలో ఒకరోజు కలిసి భోజనం చేయడం, తన అమ్మతో దేవాన్ష్ కనీసం ఒక పూట అయినా భోజనం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. ఇక తన చిన్నతనంలో అమ్మ తరచూ కొట్టేవారని, ఇప్పటికీ ఎక్కడైనా సభలో తప్పుగా మాట్లాడితే ఫోన్ చేసి మందలించేవారని వివరించారు. కష్టపడి పనిచేసే విషయంలో నాన్న చంద్రబాబు ఇప్పటికీ తిడుతుంటారని లోకేశ్ సరదాగా చెప్పారు.

ఒక మహిళ తాము కష్టపడినట్లు తమ పిల్లలు కష్టపడకూడదని భావిస్తున్నామని చెప్పగా, లోకేశ్ స్పందిస్తూ ఒకసారి మా ఇంటికి వచ్చి బాబు గారికి చెప్పు తల్లీ.. ఆయనేమో రోజూ నన్ను తిడుతున్నారు. నేను 15 గంటలు పనిచేస్తున్నా, నువ్వు 16 గంటలు పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ లోకేశ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పిల్లలను గారాభంగా పెంచాలని.. అదే సమయంలో కష్టాలు అంటే ఏంటో తెలియజేయాలని హితవుపలికారు. ఇక పిల్లలు ఎక్కువగా పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. పుస్తకాలు చదివితే క్రియేటివిటీ పెరుగుతుందని లోకేశ్ వివరించారు.

మహిళలను గౌరవించాలి

ఇక మహిళలతో ముచ్చట్లు సందర్భంగా పిల్లలకు నైతిక విలువలు, మహిళలను గౌరవించడంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ విషయంలో తన స్వీయ అనుభవాలను పంచుకోవడమే కాకుండా, మహిళల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో ఓ మహిళ అత్యంత విలువైన సూచన చేయగా, మంత్రి లోకేశ్ ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రస్తుతం ఆడపిల్లలకు మాత్రమే ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నారని, కానీ మగ పిల్లలకు కూడా ఈ అంశంపై విలువలు నేర్పించాలని ఆ మహిళ సూచించారు. అప్పుడే ఆడపిల్లల విషయంలో మగపిల్లలు గౌరవంగా నడుచుకునే వీలుందని తెలియజేశారు. ఇదే సమయంలో మహిళల గౌరవంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. యువగళం పాదయాత్ర సమయంలో తనను విమర్శించేందుకు కొందరు గాజులు తొడుక్కున్నావా? చీరకట్టుకున్నావా? అంటూ వ్యాఖ్యానించేవారని, ఆ సమయంలో ఆడవాళ్లను కించపరిచేలా ఉన్న విమర్శలు తనను బాధపెట్టేవని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా మహిళలతో సమావేశంలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు లోకేశ్ ప్రయత్నించారు. ఇలా కేవలం అరగంట వ్యవధిలో అనేక విషయాలపై మాట్లాడిన మంత్రి తన రాజకీయ లక్ష్యాలను వివరించడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమంపై ప్రచారం పూర్తి చేసి వినూత్నంగా వ్యవహరించారని అంటున్నారు.