పెండింగులో లోకేశ్ పదవి.. కారణాలేంటి?
అయితే పార్టీలో మాత్రం లోకేశ్ పదవిపై పూర్తి క్లారిటీ ఉందని అంటున్నారు. అదే సమయంలో మహానాడు వేదికపై ఎప్పుడూ పదవులపై ప్రకటన చేయలేదన్న విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 3:00 AM ISTయువనేత, టీడీపీ భావినేతగా చెబుతున్న మంత్రి నారా లోకేశ్ కు పట్టాభిషేకం ఇప్పట్లో ఉండదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు వేదికపై లోకేశ్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంటుగా ప్రమోట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ ముఖ్య నేతలు కూడా తమ ప్రసంగాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేశ్ కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక లోకేశ్ ప్రతిపాదించిన ఆరు కీలక శాసనాలను ఆమోదించిన పార్టీ.. ఆయనకు వర్కింగు ప్రెసిడెంట్ పదవిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడులోనే లోకేశ్ పట్టాభిషేకంపై ప్రకటన ఉంటుందని అంతా ఎదురుచూశారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో పార్టీ నేతల అభిప్రాయాలపైనా ఆయన స్పందించలేదు. లోకేశ్ కు వర్కింగు ప్రెసిడెంట్ పదవిపై అవును అని కానీ, కాదు అని కానీ అధినేత చెప్పకపోవడం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు పార్టీలో లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై చంద్రబాబుకు ఏమైనా? అభ్యంతరాలు ఉన్నాయా? లేక ఇంకా సమయం ఉందన్న భావనతో ఆయన మౌనంగా ఉన్నారా? అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.
అయితే పార్టీలో మాత్రం లోకేశ్ పదవిపై పూర్తి క్లారిటీ ఉందని అంటున్నారు. అదే సమయంలో మహానాడు వేదికపై ఎప్పుడూ పదవులపై ప్రకటన చేయలేదన్న విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. మహానాడులో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించినందున ఆయన ఆ తర్వాత కార్యవర్గాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. పూర్తిగా అధ్యక్షుడి ఇష్ట ప్రకారం జరిగే పదవుల పంపకానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. బహుశా లోకేశ్ కు వర్కింగు ప్రెసిడెంట్ పదవిని అప్పుడే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
టీడీపీలో అధ్యక్షుడి తర్వాత అంత కీలకమైన వ్యవస్థ పొలిట్ బ్యూరో. 43 ఏళ్ల టీడీపీలో చాలా మంది సీనియర్లు పొలిట్ బ్యూరో మెంబర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థను పునఃనిర్మించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముందుగా లోకేశ్ నాయకత్వానికి తగినట్లు పొలిట్ బ్యూరోను పునర్యవ్వస్థీకరించి ఆ తర్వాతే లోకేశ్ పదవిపై ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మహానాడులో లోకేశ్ పదవిపై ప్రకటన రాలేదని అంటున్నారు. మొత్తానికి మీడియా హైప్ ఇవ్వడం ద్వారా టీడీపీ భావినేతగా లోకేశ్ అందరి ఆమోదం పొందారని, ఇక అధికారికంగా ఆ బాధ్యతలు తీసుకోవడమే మిగిలిందని అంటున్నారు.
