Begin typing your search above and press return to search.

ఏడాదిలో ఎదిగిన లోకేష్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంటోంది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 9:00 PM IST
ఏడాదిలో ఎదిగిన లోకేష్
X

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంటోంది. మరో వారం రోజులలో ఆ ముచ్చట తీరనుంది. కూటమి అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు పడిన కష్టాన్ని జనాలు గుర్తించారు. మండు వేసవిలో యాభై డిగ్రీల సెలిస్యస్ ఉష్ణోగ్రతలలో మిట్ట మధ్యాహ్నం కోస్తా జిల్లాల నడిబొడ్డున రాయలసీమ జిల్లాల మధ్యన నిలబడి బాబు చేసిన ఎన్నికల ప్రసంగాలు జనాలను ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన ఆలోచనను కలిగించాయి.

ఏపీ కోసం బాబు పడుతున్న తపనను అర్ధం చేసుకున్న జనాలు వన్ సైడెడ్ గా టీడీపీ కూటమికి ఓటేశారు. ఇక చంద్రబాబుతో పాటుగా ఆయన తనయుడు నారా లోకేష్ కష్టం కూడా 2024 ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటంగా కనిపించింది. ఏడాది పాటు యువగళం పేరుతో లోకేష్ కుప్పం టూ ఇచ్చాపురం దాకా సాగించిన భారీ పాదయాత్ర కూడా కూటమికి ఘన విజయం దక్కేలా చేసింది.

ఈ నేపధ్యంలో లోకేష్ కి టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర లభించింది. కేవలం చంద్రబాబు కుమారుడు అని కాకుండా ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ని గత అయిదేళ్ళలో సాధించుకున్న క్రమంలో ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన శాఖలు ఆయనకు లభించాయి. విద్య భారీ పరిశ్రమలు ఐటీ వంటి శాఖలను చూస్తూ ఏపీకి పెట్టుబడులను తీసుకుని వచ్చే విషయంలో గత ఏడాది కాలంగా తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతోంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. టీడీపీ ఈసారి ఎంపిక చేసిన మంత్రులలో ఎక్కువ మంది కొత్త వారు యువత ఉన్నారు. ఆ ఎంపిక వెనక లోకేష్ ముద్ర ఉందని చెబుతారు. ఇక గత ఏడాది అక్టోబర్ లో లోకేష్ వారం రోజుల పాటు అమెరికా యాత్ర చేసి అమరావతికి చేరుకున్న సందర్భంగా మొత్తం తెలుగుదేశం మంత్రులు అంతా లోకేష్ ఇంటికి వెళ్ళి మరీ ప్రయ్తేకంగా ఆయనను అభినందించిన తీరుని చూసిన వారికి ప్రభుత్వంలో ఆయన పట్టు ఏమిటో తెలుస్తుంది.

ఇక ప్రభుత్వంలో ఆయన వినూత్నమైన కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వాట్సప్ గవర్నెన్స్ అన్న దానికి తీసుకుని రావడం ద్వారా లోకేష్ మంచి మార్కులే అందుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను స్వయంగా పరిశీలన చేస్తూ మంచిగా పనిచేసే మంత్రులను ప్రోత్సహిస్తూ ఒక విధంగా లోకేష్ కూటమిలో అతి ముఖ్యుడిగా మారిపోయారు.

ఇక తాజాగా చూస్తే కడప వేదికగా జరిగిన మహానాడులో మొత్తం లోకేష్ కనిపించారు. పార్టీ నాయకత్వం ఆయనకు అప్పగించాలన్న డిమాండ్ సైతం సీనియర్లు జూనియర్ల నుంచి ఒకే విధంగా వచ్చింది. టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా లోకేష్ తొందరలో నియమితులు కాబోతున్నారు అని అంటున్నారు. పార్టీ సభ్యత్వం కోటికి చేర్పించడం వెనక లోకేష్ కృషి ఉందని చెబుతారు. అలాగే క్యాడర్ కి భరోసాను ఇస్తూ అనేక సంక్షేమ పధకాలను సైతం క్యాడర్ కోసం చేపడుతున్నారు

ఇక పార్టీలోని వారు కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ లోకేష్ ఫ్యూచర్ లీడర్ అని నినదిస్తున్నారు అంటే ఒక్క ఏడాదిలో లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కొన్నాళ్ళ క్రితం డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉప ముఖ్యమంత్రి కాదు ఆయన ఏదో నాటికి ముఖ్యమంత్రే అన్న భావన బలంగా ఏర్పడుతోంది. ఒకనాడు పార్టీ జనాలలోనే వినిపించే ఈ మాట ఇపుడు సాదర జనాలలోనూ చర్చగా వచ్చింది అంటే లోకేష్ ఎదుగుదల ఈ ఒక్క ఏడాదిలో ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.