లోకేష్ సామర్థ్యానికి కఠిన పరీక్ష.. విషయం ఇదీ..!
నారా లోకేష్.. రాజకీయ యవనికపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న యువ నాయకుడు.
By: Tupaki Desk | 26 May 2025 7:00 PM ISTనారా లోకేష్.. రాజకీయ యవనికపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న యువ నాయకుడు. 2012 వరకు పెద్దగా ఎవరికీ తెలియని నారా లోకేష్.. 2013-14 మధ్య చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర ద్వారా రాజకీయాల్లో అడుగు పెట్టారు. అప్పుడు కూడా ఆయన బహిరంగ వేదికలపై కనిపించలే దు. కేవలం డిజిటల్ పరంగా పార్టీని ముందుకు నడిపించారు. కొందరు ఎన్నారైలతో టచ్‌లో ఉంటూ.. పార్టీ కార్యక్రమాలను తెరచాటునే నిర్వహించారు.
ఇలా .. మొదలైన ప్రస్తానం.. 2016-17 మధ్య కాలంలో ఎమ్మెల్సీ కావడం.. ఆ వెంటనే మంత్రి పదవి దక్కడం.. వంటివి నారా లోకేష్ రాజకీయ జీవితాన్ని ప్రజలకు పరిచయం చేసింది. ఇక, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... నారా లోకేష్ రాజకీయంగా మరింత పుంజుకున్నారు. 2023-24 మధ్య కాలంలో తన విశ్వరూపం చూపించారు. యువగళం పాదయాత్ర ద్వారా.. నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితులయ్యారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ఆయన టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు. దాదాపు ఖాయమైంది. ఇదేజరిగితే.. నారా లోకేష్‌కు రెండు రికార్డులు సొంతం చేసుకున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. 42 ఏళ్లకే పార్టీపై పూర్తి ఆధిక్యం దక్కించుకున్న నాయకుడిగా ఆయన టీడీపీ లో కీలక నేతగా ఎదిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. తండ్రి చంద్రబాబు వారసుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సంసిద్ధులయ్యారన్న సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది.
అయితే.. ఇది అంత తేలిక కాదు. నారా లోకేష్ వ్యక్తిత్వానికి టీడీపీ నాయకులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అనేక మంది నాయకులు.. అనేక అనుభవాలు.. అనేక వ్యూహ ప్రతివ్యూహాలు వేయగల ఢక్కా ముక్కీలు తిన్న నాయకులు ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకే ఒక్కొక్క సారి కొరుకుడు పడని నాయకగణం కనిపిస్తూనే ఉంది.
ఇలాంటి వారిని తట్టుకుని పార్టీని ముందుకు నడిపించడంలోనూ.. 2029 లేదా అంతకన్నాముందే ఎన్నికలు వచ్చినా.. ఆయన సారథ్యంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడం వంటివి కఠిన పరీక్షలుగానే నిలుస్తాయి. అయితే.. దీనికి నాలుగు సంవత్సరాల వరకు సమయం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ పుంజుకుంటారనే అంటున్నారు పరిశీలకులు. ఏం జరుగుతుందో చూడాలి.
