ఫీడ్ బ్యాక్ కమిటీ- లోకేష్ వినూత్న ప్రయోగం
తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు మనుగడలో ఉంటూ విజయాలు సాధిస్తోంది అంటే దానికి కారణం కాలంతో పాటు పార్టీని సరిదిద్దుకోవడం
By: Satya P | 5 March 2026 9:34 AM ISTతెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు మనుగడలో ఉంటూ విజయాలు సాధిస్తోంది అంటే దానికి కారణం కాలంతో పాటు పార్టీని సరిదిద్దుకోవడం. ఎప్పటికప్పుడు క్యాడర్ కి లీడర్ కి మధ్య కో ఆర్డినేషన్ పెంపొందించడం. అలాగే ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకుని దానికి పార్టీని మరింత పటిష్టం చేసుకోవడం. నిర్ణయాలలో వేగం పెంచడం. ఈ క్రమంలోనే టీడీపీలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు ఫీడ్ బ్యాక్ కమిటీ. టీడీపీలో ఇది ఒక కీలకమైన సంస్థాగత సంస్కరణ అని అంటున్నారు. ఈ ఆలోచన చేసింది మంత్రి నారా లోకేష్ అని అంటున్నారు. మొత్తానికి ఆయన ఆలోచనతోనే కమిటీ ఏర్పాటు జరిగింది అని అంటున్నారు. ఇంతకీ ఈ వ్యవస్థ విధి విధానాలు ఏమిటి ఏ విధంగా పనిచేస్తుంది అంటే చాలానే ఉంది.
క్యాడర్ తో డైరెక్ట్ గానే :
తెలుగుదేశం పార్టీలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఇపుడు కొత్తగా ఏర్పాటు అయిన ఫీడ్ బ్యాక్ కమిటీ క్యాడర్ తో మరింత అనుసంధానం అవుతుంది. నేరుగా క్యాడర్ నుంచి సమాచారం సేకరించడం దానిని అధినాయకత్వానికి అందించడం ఈ కమిటీ చేసే అతి ముఖ్యమైన పనిగా చెబుతున్నారు. దీని వల్ల పార్టీలో గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్యాడర్ ఎవరైనా తమ అభిప్రాయాలను సమస్యలను ఈ కమిటీ ద్వారా అధినాయకత్వం దృష్టిలోకి సులువుగా తీసుకుని రాగలుగుతారు అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ మీద ఫోకస్ :
ఇక ఈ కమిటీ చేసే మరో కీలకమైన పని ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్ లో నిరంతరం జరిగే పరిణామాలను గమనిస్తూ ఎప్పటికపుడు వాటిని పార్టీ పెద్దలకు సమాచారంగా అందించడం. అంటే ఒక వైపు క్యాడర్ నుంచి సేకరించిన సమాచారం వారి సమస్యలు వినతులతో పాటు పార్టీ పరిస్థితి మీద కూడా మోనిటరింగ్ చేస్తూ అప్టూ డేట్ గా ఇన్ఫర్మేషన్ ని హై కమాండ్ కి ఇవ్వడం అన్న మాట. దీని వల్ల సంస్థగతంగా పార్టీ ఇంకా బలంగా తయారు అవుతుందని అంటున్నారు.
సీనియర్ నేత సారధ్యంలో :
ఇక ఈ ఫీడ్ బ్యాక్ కమిటీకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ క్యాడర్ తో నేరుగా సమావేశం అయి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో క్యాడర్ తమ అభిప్రాయాలను బాధలను సమస్యలను నేరుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాని వల్ల పార్టీకి కొంత ఇబ్బంది అవుతోంది. అది ప్రత్యర్ధికి ఆయుధంగా మారుతోంది అని అంటున్నారు. అందుకే వ్యవహారం అంతవరకూ వెళ్ళకుండా కమిటీతోనే వారు తమ సమస్యలు చెప్పుకుంటే ఒక కుటుంబం మాదిరిగా పరిష్కారం లభిస్తుంది అని చెబుతున్నారు
తొలి భేటీ అక్కడే :
ఇక ఈ కమిటీ ఏర్పాటు అయ్యాక సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్ గా ఉండే పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక సోషల్ మీడియా కార్యకర్తలో తొలి భేటీని వేసింది. ఆ కార్యకర్త చెప్పిన విషయాలను కమిటీ పూర్తి శ్రద్ధతో వినడం జరిగింది. పార్టీలో ఉన్న సమస్యలు కానీ విధానంలో లోపాలను కానీ మొహమాటం లేకుండా చెప్పాలని కమిటీ సభ్యులు కోరారు. ఆ మీదట అభిప్రాయాలను సేకరించారు. సమస్య ఏదైనా సోషల్ మీడియాకు నేరుగా పోస్టు చేయకుండా కమిటీ ముందుకు రావాలని చైర్మన్ సత్యనారాయణ రాజు పార్టీ క్యాడర్ ని కోరారు. ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా అధినాయకత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు.
