బీహార్ దంగల్: బాబు కాదు లోకేష్ ఎంట్రీ!
బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు.. తుది అంకానికి చేరుకుంది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి.
By: Garuda Media | 8 Nov 2025 6:00 PM ISTబీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు.. తుది అంకానికి చేరుకుంది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 6న జరిగిన తొలి దశ పోలింగ్‌లో .. 121 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు.. ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక, మిగిలిన 122 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కేవలం రెండు రోజులు మాత్రమే(శనివారం, ఆదివారం) గడువు ఉంది.
10వ తేదీ ప్రచారం ఉండదు. ఆదివారం సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యలో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల్లో.. కీలక పార్టీగా ఉన్న టీడీపీ కూడా ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి బీహార్‌లో తెలుగు వారు లేరు. ఉన్నా 1 శాతానికి మించి ఉంటారని చెప్పలేం. అయినప్పటికీ.. కూటమి మిత్ర ధర్మానికి కట్టుబడి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రచారానికి ముందుకు వచ్చారు.
తానే స్వయంగా బీహార్‌కు వెళ్లి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రచారం చేస్తానన్నారు. అయితే .. అనూహ్యంగా ఈ ప్లాన్‌ను మార్చుకున్నారు. ప్రధానంగా రెండో దశలో జరగనున్న ఎన్నికల్లో పూర్వాంచల్ లోని 4 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా యువత ఎక్కువగా ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌ను పంపించాలని సీఎం చంద్రబాబు ఆకస్మిక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే.. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
1) భాషా పరమైన సమస్య. బీహార్ ప్రజలకు దాదాపు హిందీ తప్ప మరో భాష తెలియదు. దీంతో నారా లోకేష్ అయితేనే వారితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.
2) యువ నాయకుడిగా దేశానికి, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు మరింతపరిచయం అయ్యేందుకు ఇదొక గొప్ప అవకాశంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ను పంపిస్తున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులు లోకేష్ సుడిగాలి పర్యటన చేసి ప్రచారం చేయనున్నారు.
