Begin typing your search above and press return to search.

‘ట్రైన్ టు బుసాన్’.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

By:  Tupaki Political Desk   |   8 July 2026 2:37 PM IST
‘ట్రైన్ టు బుసాన్’.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ వాటడంలో ఆయన ఇతర నేతలు కంటే ముందుంటారు. అదేవిధంగా ఎంటరటైన్మెంట్, స్టోర్ట్స్ ల్లో పరకాయ ప్రవేశం చేస్తూ తనను తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తన అధికారిక పర్యటనలు, పర్సనల్ విశేషాలు, రాష్ట్రాభివృద్ధికి చెందిన ముఖ్య సమాచారం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం మంత్రి లోకేశ్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. బిజినెస్ మేన్ లా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫొటోలతోపాటు దక్షిణ కొరియాలో సహచరులతో కలిసి ట్రైనులో జర్నీ చేస్తున్న ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్టులో ఈ రోజు దక్షిణకొరియాలో భిన్నమైన ప్రయాణం చేస్తున్నాను అంటూ తెలియజేస్తూ ‘‘ట్రైన్ టు బుసాన్’’ అనే ప్రఖ్యాత చిత్రాన్ని గుర్తు చేశారు.

కొరియన్ చిత్రమైన ‘ట్రైన్ టు బుసాన్’ అత్యంత ప్రసిద్ధమైన యాక్షన్-హారర్ సినిమా. ఈ పేరు తెలియని వారు ఉండరని అంటారు. దీంతో తన పర్యటన విశేషాలను తెలియజేసేందుకు లోకేశ్ తెలివిగా ఆ చిత్రం పేరును వాడుకుని అందరిలో ఒక రకమైన కుతూహలం పెంచేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే బలమైన సంకల్పంతో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడ పారిశ్రామిక వర్గాలతో చేపడుతున్న చర్చల వివరాలను వెల్లడించేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొరియన్ చిత్రం 'ట్రైన్ టు బుసాన్' పేరును గుర్తు చేస్తూ సియోల్ నుండి బుసాన్ నగరానికి రైలులో ప్రయాణిస్తున్న ఫొటోలను షేర్ చేశారు. బ్లాక్ సూట్, అత్యంత ప్రొఫెషనల్ లుక్ ఉన్న ఫొటోలను జతచేయడంతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అపెక్స్-కొరియా ప్రారంభం

మంత్రి లోకేష్ తన పర్యటనను కేవలం పలకరింపులకే పరిమితం చేయకుండా, పెట్టుబడుల ఆకర్షణకు బలమైన పునాదులు వేస్తున్నారు. బుసాన్‌లో ఆయన 'అపెక్స్-కొరియా' కేంద్రానికి శ్రీకారం చుట్టినట్లు ఎక్స్ లో ప్రకటించారు. ఇది ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేయడమే కాకుండా, కొరియన్ పెట్టుబడిదారులకు ఏపీలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయడానికి ఒక సింగిల్ విండో వ్యవస్థగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నం ఏపీని కొరియన్ పారిశ్రామిక దిగ్గజాలకు ప్రధాన గమ్యస్థానంగా మార్చే దిశగా వేసిన కీలక అడుగు అని పరిశ్రమల నిపుణులు భావిస్తున్నారు.

దిగ్గజ సంస్థలతో వరుస సమావేశాలు

తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ వరుసగా అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల అధిపతులతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా 101.9 బిలియన్ డాలర్ల భారీ ఆస్తులు కలిగిన బీఎన్-కే ఫైనాన్షియల్ గ్రూప్‌తో ఆయన జరిపిన చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమరావతి రాజధానిలో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా మంత్రి ఆ సంస్థను కోరారు. ఇది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అమరావతి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెబుతున్నారు. అలాగే, బూయాంగ్ గ్రూప్, హ్యుంగ్ సాంగ్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన భేటీ కానున్నారు.

పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన పర్యటన

ఈ పర్యటన కేవలం సమావేశాలకే పరిమితం కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి క్షేత్రస్థాయిలో పారిశ్రామిక అనుభవాలను తెలుసుకోవడానికి కూడా లోకేష్ ప్రాధాన్యతనిస్తున్నారు. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, ఏపీలోని సముద్ర ఆధారిత పరిశ్రమల విస్తరణపై చర్చించనున్నారు. అలాగే, స్థానిక షూ ఫ్యాక్టరీని సందర్శించి, కొరియన్ తయారీ రంగంలోని పద్ధతులు, టెక్నాలజీ గురించి తెలుసుకోనున్నారు. ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రపంచస్థాయి సంస్థలను ఏపీకి తీసుకురావడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న ఈ పర్యటన రాష్ట్రానికి ఏ మేరకు ఫలితాలను అందిస్తుందో వేచి చూడాలి.