వారు మారరు: వైసీపీపై లోకేష్ కామెంట్స్
వైసీపీ నాయకులపై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 2 Jun 2025 1:47 AM ISTవైసీపీ నాయకులపై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. వాటిని చూస్తే.. వైసీపీ మారినట్టు ఏకోశానా కనిపించడం లేదన్నారు. 1) తిరుమలలో వైసీపీ నాయకుడు ఒకరు.. టీటీడీ ఏర్పాట్లపై వీరంగం వేయడం. ఆ తర్వాత.. సారీ చెప్పడం. ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. పశ్చిమ గోదావరికి చెందిన వైసీపీ నాయకుడు తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
అయితే.. క్యూలైన్‌లో ఎలాంటివసతులు లేవని.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. చైర్మన్ బీఆర్ నాయకుడిపై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారం దుమారం రేపింది. అయితే.. ఆనక శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక.. ``అబ్బే ఊరికేనే అన్నా.. అంతా బాగుంది. సారీ!`` అంటూ వ్యాఖ్యానించి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన వ్యవహారంపై టీటీడీ కేసు పెట్టాలని నిర్ణయించు కుంది. దీనిని తాజాగా లోకేష్ ఎండగట్టారు.
2) మహానాడును పురస్కరించుకుని కడపలో టీడీపీ మహాసంబరం చేసింది. అయితే.. దీనికి ప్రతిగా ఉమ్మడి కృష్నాజిల్లాలో వైసీపీ కార్యకర్తలు ఓ బాలుడు తొక్కుతున్న సైకిల్‌ను లాక్కుని దానిని నేలపై వేసి కాళ్ళతో తొక్కి.. నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. దీనిని నారా లోకేష్ తప్పుబట్టారు. ఇలా చేయడం వైసీపీకి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా రాజకీయాలు చేయడంలో వైసీపీ ఎప్పుడో విఫలమైందని.. ఇప్పుడు అరాచక శక్తిగా మారుతోందని వ్యాఖ్యానించారు.
ఈ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా.. ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. నాయకుడు సరైన వాడు అయితే.. కార్య కర్తలు కూడా సరైన దారిలోనే నడుస్తారని.. దీనికి టీడీపీనే ఉదాహరణ అని పేర్కొన్నారు. నాయకుడు చంద్రబాబు దూరదృష్టితో ఆలోచన చేస్తున్నందుకే.. కార్యకర్తలు కూడా దూరదృష్టితో పార్టీని నడిపిస్తున్నా రని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్న మేధావులు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చురకలు అంటించారు.
