Begin typing your search above and press return to search.

సొంత బాబాయ్ ని లేపేసి తప్పుకాదంటున్నారు : జగన్ పై లోకేశ్ ఫైర్

రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడాన్ని జగన్ రెడ్డి తప్పుపట్టడంపై లోకేశ్ ఫైర్ అయ్యారు.

By:  Tupaki Political Desk   |   15 July 2026 6:55 PM IST
సొంత బాబాయ్ ని లేపేసి తప్పుకాదంటున్నారు : జగన్ పై లోకేశ్ ఫైర్
X

విశాఖ జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడిన మాటలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడాన్ని జగన్ రెడ్డి తప్పుపట్టడంపై లోకేశ్ ఫైర్ అయ్యారు. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనుల ప్రారంభానికి వచ్చిన మంత్రి లోకేశ్ మాజీ మంత్రి వివేకా హత్యతోపాటు గతంలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహనరెడ్డి పార్టీని హిట్ అండ్ రన్ పార్టీ అనే పేరు పెట్టవచ్చని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారు టైరు కింద తొక్కించారని, ఆ రోజు జగన్ ఆగివుంటే సింగయ్య బతికి ఉండేవారని అన్నారు. ఈ కేసు విచారణ జరగకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. జనం ప్రాణాలపై ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని లోకేశ్ ధ్వజమెత్తారు. రోడ్డు ప్రమాదం చేసిన మాజీ మంత్రి కుమారుడు మేజర్ అని, ప్రమాదం చేసిన సమయంలో ఆ బాబు భయపడి ఉండవచ్చని, కానీ బాధ్యత ఉన్న తల్లిదండ్రులు ప్రమాదం విషయం తెలుసుకుని పోలీసులకు అప్పగించాలని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కుమారుడిపై ఆరోపణలు వస్తే, ఆయన తన కుమారుడిని పోలీసులకు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కానీ ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణిస్తే చాలా చులకనగా మాట్లాడుతున్నారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారని ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో సింపుల్ గా చెప్పేస్తున్నారని అన్నారు. ‘‘మీ బాబాయ్ ని చంపేశారు. ఆయనే చంపించాడు. వాళ్ల బాబాయ్ ని జగన్ చంపించాడు. ఆ రోజు ఈ గడపలోనే నేను చెప్పా’’ అంటూ మాజీ మంత్రి వివేకా హత్యపై మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంత బాబాయ్ ని లేపేశాడు తప్పుకాదంట.. సింగయ్యను ఆయనే చంపేశాడు తప్పుకాదంట.. వాళ్ల పార్టీకి చెందిన వారు ఒకరిని గుద్ది చంపేస్తా తప్పుకాదంట’’ అని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా విశాఖలో పడవ బోల్తాపడి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంపైనా మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మత్స్యకారులను ఆదుకునే విషయంలో తమకు చిత్తశుద్ది ఉందని, బాధితులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించామని వెల్లడించారు. జగన్ రెడ్డి అధికారంలో ఉండగా 250 మంది మరణిస్తే ఒక్కరికి సాయం చేయలేదని ఆరోపించారు. ఆ సమయంలో రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించేలా నిబంధనలు ఉన్నా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.