Begin typing your search above and press return to search.

'సీక్రెట్' మీటింగ్ కలకలం : మోదీ దృష్టికి లోకేశ్ భేటీ - యువనేత క్లారిటీ ఇదే..

ఢిల్లీలో జాతీయ మీడియా చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చగా మారిన ప్రత్యేక సమావేశంపై పూర్తి వివరణ ఇచ్చారు.

By:  Tupaki Political Desk   |   23 Jun 2026 9:00 PM IST
సీక్రెట్ మీటింగ్ కలకలం : మోదీ దృష్టికి లోకేశ్ భేటీ - యువనేత క్లారిటీ ఇదే..
X

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న ‘సీక్రెట్’ మీటింగ్’పై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జాతీయ మీడియా చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చగా మారిన ప్రత్యేక సమావేశంపై పూర్తి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తోపాటు మాజీ ఉప రాష్ట్రపతి, ఒక ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మధ్య రహస్య సమావేశం జరిగిందని కొద్దిరోజులుగా టాక్ నడుస్తోంది. ఈ విషయం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందన్న సమాచారం మరింత హీట్ పెంచింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఆ రహస్య సమావేశంపై స్పందించారు. ప్రచారంలో ఉన్నట్లు సమావేశం జరగడం నిజమే కానీ, ప్రచారంలో ఉన్న వదంతులు నిజం కావని స్పష్టం చేశారు. తాము ఎన్డీఏతో కలిసి నడుస్తామని, ప్రధాని మోదీకి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లైందని అంటున్నారు.

అసలేం జరిగిందంటే..

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రధానంగా మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నా, ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పెట్టుబడుల సాధనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా విదేశీ పర్యటనలలో సైతం పారిశ్రామిక వేత్తలను కలిసేందుకే పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఇటీవల ఓ బడా పారిశ్రామిక వేత్తను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భేటీకి మంత్రి లోకేశ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఇదే సమయంలో ఈ భేటీపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంపై రకరకాల ప్రచారం జరిగింది.

అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలు అనివార్యంగా బయటకు పొక్కడంతో పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమావేశమా లేక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక భేటీనా అన్నది అప్పట్లో సస్పెన్స్‌గా మారింది. ఈ భేటీ వల్ల పొత్తు రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? లేక ఎన్డీయే కూటమిలో అంతర్గత చర్చలు మొదలయ్యాయా? అనే కోణంలో మీడియాలో కథనాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ సమాచారం ఢిల్లీ స్థాయికి చేరడం, స్వయంగా ప్రధాని మోదీ వరకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఒక యువనేతగా, మంత్రిగా లోకేశ్ తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని భావించిన ప్రధాని కార్యాలయం, దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. నిరంతరం అప్రమత్తంగా ఉండే బీజేపీ అధిష్టానం, ఈ భేటీ ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిందని కూడా చెబుతున్నారు.

లోకేశ్ క్లారిటీ

ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ చాలా పరిణితితో వ్యవహరించారు. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా, ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన కోసమే తమ భేటీలో చర్చించానని, ఇందులో ఎటువంటి రాజకీయ అజెండా లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. లోకేశ్ ఇచ్చిన వివరణపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రగతి కోసం ఎవరిని కలవడానికైనా, ఎలాంటి చర్చలు జరపడానికైనా సంకోచించాల్సిన అవసరం లేదని, అయితే పారదర్శకత చాలా ముఖ్యమని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.