Begin typing your search above and press return to search.

పవన్ స్పీచ్ లోనూ లోకేషే...ఏం జరుగుతోంది అసలు ?

నారా లోకేష్ పేరుని విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా మూడు నాలుగు సార్లు పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 9:20 PM IST
పవన్ స్పీచ్ లోనూ లోకేషే...ఏం జరుగుతోంది అసలు ?
X

ఏపీలో లోకేష్ గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోందా. నారా లోకేష్ కూటమిలో మంత్రిగా మాత్రమే ఉన్నారు. పవన్ కి అయితే ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఇది రాజ్యాంగబద్ధమైనది కాకపోయినా రాజకీయంగా ఉన్నతమైనది. ఇక చంద్రబాబు ఎటూ కూటమి సారధిగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పవన్ లను దాటుకుని సైతం కూటమి ప్రభుత్వంలో లోకేష్ అన్న పేరు అంతలా ఎందుకు వినిపిస్తోంది అన్నదే చర్చగా ఉంది.

నారా లోకేష్ పేరుని విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా మూడు నాలుగు సార్లు పేర్కొన్నారు. లోకేష్ ని ఆయన కీర్తిస్తూ వచ్చారు. ఆయన కృషి వల్లనే యోగా విశాఖలో ఫుల్ సక్సెస్ అయింది అని కూడా అన్నారు. దాని మీద గత రెండు రోజులుగా ఒక వైపు చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి సందర్భంగా వెలగపూడి సచివాలయం వ్నక ఉన్న మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనకు ఒక ఏడాది అన్న సభలో పవన్ మాట్లాడారు. ఆయన చాలా సేపే మాట్లాడారు. అయితే పవన్ ఈసారి స్పీచ్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎప్పటి మాదిరిగానే ఆయన వైసీపీ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు.

అంతే కాదు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. బాబు అనుభవజ్ఞుడు అని కీర్తించారు. ఆయన మంచి పాలసీ మేకర్ అని దేశమంతా ఆయనను అనుసరిస్తుంది అన్నారు. అంతే కాదు బాబు పాలనా దక్షుడు సమర్ధుడు అని కూడా ప్రశంసించారు. బాబు నాయకత్వంలో అనేక విజయాలను తొలి ఏడాదిలో సాధించామని అన్నారు.

అదే సమయంలో నారా లోకేష్ ని కూడా పవన్ కొనియాడడం విశేషం అనేక సార్లు లోకేష్ పేరుని ప్రస్తావిస్తూ ఆయన మంత్రిత్వ శాఖలో తెచ్చిన మార్పులు అని సభలో వినిపించారు. లోకేష్ గారు అంటూ సంభోదించడమే కాకుండా చక్కగా తన శాఖలను నిర్వహిస్తున్నారు అని పవన్ చెప్పడం విశేషం.

నిన్న మోడీ నేడు పవన్ ఈ విధంగా లోకేష్ ని పొగడడం వెనక అర్ధమేంటి వ్యూహాలేంటి అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ కి పెరిగిన ప్రాధాన్యతకు ఇది నిదర్శనమా లేక భవిష్యత్తు రాజకీయాలకు ఇది సంకేతమా అన్న చర్చ సాగుతోంది.

గతంలో అయితే ఎపుడూ పవన్ ఇంతలా లోకేష్ ప్రస్తావనను తీసుకుని రాలేదు. చంద్రబాబు నారా లోకేష్ ల సారధ్యం అని చెప్పడం కూడా ఈసారి విశేషంగా అనిపిస్తోంది. అంతే కాదు కూటమి ప్రభుత్వం ఏకంగా మరో పదిహేను నుంచి ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతుందని పవన్ గట్టిగా సభలో చెప్పారు. ఈ విషయంలో ఎవరికి అయినా అనుమానాలు ఉంటే అవి వదిలేసుకోవాలని కోరారు.

అంతే కాదు, కూటమి ఐక్యంగా ముందుకు సాగుతొందని అన్నారు. తానుగా కూటమి ఐక్యతకు గట్టిగా కోరుకుంటాను అని పవన్ అన్నారు. వైసీపీకి అలా నో చాన్స్ అని పవన్ తేల్చేశారు. దీనిని చూసిన తరువాత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

అంతే కాదు కూటమిలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ప్రాధాన్యతను గుర్తినడమే కాకుండా ఆయన విషయంలో కూడా పూర్తి సానుకూల ధోరణిలో ఉన్నట్లుగా తన ప్రసంగం ద్వారా తెలియచేశారు అని అంటున్నారు. అయితే 2029 దాకా కూటమి నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండే చాన్స్ లేదు. ఆ తరువాత కూడా బాబు సీఎం గానే ఉండాలని పవన్ కోరుకుంటున్నారు అలా కాకపోతే ఏమి జరుగుతుంది అన్న దానికి కొంత మేర పవన్ తన స్పీచ్ లో క్లారిటీ ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. కూటమిని బ్రేక్ చేసే చర్యలకు దిగను అని ఆయన అంటున్నారు అంటే ఫుల్ సపోర్ట్ అనే అని ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటున్నారు.