విదేశీ గడ్డపై ‘జై లోకేశ్’ నినాదాలు.. అంత గొప్పపని ఏం చేశారో తెలుసా?
నేపాల్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులను క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు రెండు రోజులుగా మంత్రి లోకేశ్ నిర్విరామంగా పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 11 Sept 2025 5:20 PM ISTఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల కృషికి ఫలితాన్ని అందుకుంటున్నారు. నేపాల్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులను క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు రెండు రోజులుగా మంత్రి లోకేశ్ నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ప్రత్యేక విమానాల ద్వారా ఖాడ్మాండూ నుంచి రాష్ట్ర వాసులు క్షేమంగా స్వదేశానికి వస్తున్నారు. ఊహించని పరిణామాలతో తీర్థయాత్రలకు వెళ్లిన వారు రెండు రోజులుగా నరకం అనుభవిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలతో మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసి యాత్రికులను తిరిగి తెప్పించడంలో సక్సెస్ అయ్యారు.
నేపాల్ లో తీర్థయాత్ర, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఏపీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు 217 యాత్రికులు వెళ్లారు. వీరంతా ఆ దేశంలోని సుమారు 12 ప్రాంతాల్లో వివిధ సందర్శనీయ స్థలాల్లో ఆనందంగా గడుపుతుండగా అల్లర్లు మొదలయ్యాయి. రోజుల వ్యవధిలోనే అల్లర్లు శ్రుతిమించడం, హింసకు దారితీయడంతో కర్ఫ్యూ విధించారు. దీంతో నేపాల్ పర్యటనకు వెళ్లిన మన దేశం వారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఒక వైపు హింస, మరోవైపు దోపిడీలు, దాడులతో వారంతా హడలిపోయారు. ఇదే సమయంలో తమను ఆదుకోవాలని డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ తోపాటు వారికి తెలిసిన ప్రజాప్రతినిధులకు వీడియో సందేశాలు పంపారు.
దేశం కాని దేశంలో చిక్కుకున్న యాత్రికులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ నెల 10న అనంతపురంలో భారీ బహిరంగ సభ ఉన్నప్పటికీ, మంత్రి లోకేశ్ ను ఆ కార్యక్రమం నుంచి తప్పించి, మన రాష్ట్ర యాత్రికులను రక్షించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కూడా లోకేశ్ ను అప్రమత్తం చేయడంతో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక వార్ రూమ్ సిద్ధం చేశారు. నేపాల్ లో ఉన్నవారిని గుర్తించి ఆదుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబరు అందుబాటులో ఉంచడంతోపాటు వారితో నిరంతరం మాట్లాడి క్షేమంగా తీసుకువస్తామని భరోసా కల్పించారు.
బుధవారం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండిపోయిన మంత్రి లోకేశ్ ఒకవైపు రాష్ట్ర ఉన్నతాధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తూ ప్రయాణికులతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నేపాల్ నుంచి మన యాత్రికులను క్షేమంగా రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో 24 గంటల వ్యవధిలోనే అందరినీ క్షేమంగా తిరిగి తీసుకువచ్చే ఏర్పాట్లు జరిగిపోయాయి. నేపాల్ లో మంగళవారం అల్లర్లు మొదలవ్వగా, బుధవారం హోటళ్లు, ఇతర వసతి గదుల్లో తలదాచుకున్న వారిని గురువారం ఒక చోటకు చేర్చారు. ఆ తర్వాత ఖాట్మాండు నుంచి విశాఖకు విమానంలో తరలించారు.
నేపాల్ లో మొత్తం 217 మంది ఏపీ వాసులు చిక్కుకోగా, ఈ రోజు ఉదయం 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నవూకు తీసుకువచ్చారు. అదేవిధంగా నేపాల్ లోని పేటౌడా పర్యాటక స్థలి నుంచి మరో 22 మందిని సమీపంలో ఉన్న బిహార్ సరిహద్దుకు తరలించారు. అదే సమయంలో సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇంకో 12 మందిని మన దేశానికి తీసువచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిన వారిని స్థానిక వాహనాల ద్వారా ఖాట్మాండు ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చారు. ఇలా సుమారు 144 మంది ఖాట్మాండు నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేశ్ చొరవతో ఈ ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఖాడ్మాండు వెళ్లింది. అక్కడ మన రాష్ట్ర యాత్రికులను తీసుకుని తొలుత విశాఖ, అక్కడి నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనుంది. విశాఖలో 104 మంది, తిరుపతిలో మిగిలిన 40 మందిని దింపనున్నారు.
నేపాల్ నుంచి వస్తున్న ఏపీ వాసులకు స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన యాత్రికులు క్షేమంగా విమానాశ్రయానికి చేరుకోవడం, ఈ రెండు రోజులు వారికి ఆహారం, మంచినీరు ఇతర వసతులు అందేలా ప్రభుత్వం, మంత్రి లోకేశ్ చూడటంతో యాత్రికులు పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. విమానంలో జై లోకేశ్, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. వారి కళ్లల్లో ఆనందం చూసిన ప్రభుత్వ వర్గాలు మంత్రి లోకేశ్ శ్రమ ఫలించిందని వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, నేపాల్ యాత్రికులు ‘జై లోకేశ్’ అంటూ నినదిస్తున్న వీడియోలను అధికార టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.
