రక్షాబంధన్ ...లోకేష్ శ్రీరామరక్ష !
లోకేష్ నారా చంద్రబాబుకు ఏకైక సంతానం అన్నది తెలిసిందే. ఆయనకు సొంత చెల్లెళ్ళు ఎవరూ లేరు.
By: Tupaki Desk | 10 Aug 2025 1:48 AM ISTఅన్నయ్య అన్నావంటే అభయం ఇస్తానంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అంటున్నారు. తెలుగు నాట జరిగిన రక్షాబంధన్ ఉత్సవాలు చూస్తే కనుక లోకేష్ టాక్ ఆఫ్ ది డే అయిపోయారు. ఆయన చేతినిండా రక్షలతో సరికొత్తగా మెరిసారు. అందరికీ అండగా తాను ఉంటాను అని ఆ విధంగా సంకేతం ఇచ్చారు. ఒక మంత్రిగా ఉన్న ఆయన మహిళామణులందరికీ సోదరుడిగా మారిపోయారు. ప్రత్యేకించి మంగళగిరి సోదరీమణులు అంతా పోటీలు పడి మరీ లోకేష్ కి రాఖీలు కట్టి తమ అవ్యాజమైన ప్రేమను చాటారు. దాంతో లోకేష్ సోదరభావం ప్రస్ఫుటంగా అందరికీ అగుపించింది.
సొంత బంధం లేకపోయినా :
లోకేష్ నారా చంద్రబాబుకు ఏకైక సంతానం అన్నది తెలిసిందే. ఆయనకు సొంత చెల్లెళ్ళు ఎవరూ లేరు. అయితేనేమి ఆయనకు ఏకంగా తన సొంత నియోజకవర్గంలో వేలాది మంది సోదరీమణులు ఉన్నారు అని రుజువు చేసుకున్నారు. ఈ బంధం అందంగా ఉందని ఆ సోదరీమణుల ప్రేమ ఏ జన్మ బంధంగానో ఉందని రక్ష రేకుల సాక్షిగా ఆయన నిరూపించారు. బంధం పెనవేసుకోవాలి కానీ కాదేదీ సొంతం అని కూడా అనిపించారు. అందుకే అందరికీ అన్నయ్యగా మారిపోయారు. ఆ అవ్యాజమైన అభిమానాన్ని మనసారా ఆస్వాదించారు.
కట్ చేస్తే సీన్ అలా :
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ కుటుంబాలలో ఇద్దరు అన్నయ్యకు వారికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అయితే ఆ అన్నాచెళ్ళెళ్ళ గురించే అంతా చర్చించుకుంటున్నారు. వారే జగన్ షర్మిల అలాగే కేటీఆర్ కవిత. ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య చెరిగిపోని అనురాగ బంధం ఉందని గతంలో జరిగిన రక్షా దివస్ వేడుకలు చెప్పకనే చెప్పాయి. ఈ పండుగ వేళ చెల్లెమ్మలు అన్నలకు రక్షలను కడుతూంటే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. కానీ ఈ ఏడాది ఆ సన్నివేశం అయితే కనిపించలేదని చర్చించుకుంటున్నారు.
కమ్మెసిన రాజకీయం :
బంధాలను సైతం కమ్మేస్తుంది రాజకీయం అంటే ఇదేనేమో అనిపించకమానదు. జగన్ షర్మిలల మధ్య చాలా కాలంగా రాజకీయం చేరి వ్యక్తిగత బంధాన్ని దెబ్బ తీసింది అన్నది ప్రచారంలో ఉంది. దాంతో ఈ మధ్య కాలంలో ఎపుడూ రక్షా బంధన్ వేడుకల్లో ఈ ఇద్దరూ కనిపించలేదు. అయితే తెలంగాణాలో మాత్రం కవితా కేటీఆర్ మాత్రం ఈ రోజున ఎంతో ముచ్చటగా కనిపించేవారు. తమ బంధాన్ని బలంగా చాటుకునేవారు. కానీ ఈసారి మాత్రం కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. కవిత కూడా అన్నకు రక్షను కట్టలేకపోయారు. మరి ప్రతీ ఏటా అందుబాటులో ఉండే కేటీఆర్ ఈసారి ఢిల్లీలో ఎందుకు ఉన్నారని చర్చ సాగుతోంది. రాజకీయమే ఈ ఇద్దరి మధ్య అడ్డుగోడలా మారిందని ప్రచారం అయితే ఉంది.
కేసీఆర్ ఆదర్శంగా :
ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ అధినాయకుడు తెలంగాణా మాజీ సీఎం అయిన కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన తన అక్క చెల్లెళ్ళ మధ్య రక్షా బంధన్ జరుపుకున్నారు. వారి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వయసులో కూడా తమ బలమైన బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్న కేసీఆర్ నిజంగా ఈ తరానికి స్ఫూర్తి అనే అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు వేరు వ్యక్తిగత బంధాలు వేరు అన్నది అంతా గుర్తెరగాలని అంటున్నారు. కానీ ఆచరణలో అలా జరగడం లేదు రాజకీయమే అన్నింటినీ డామినేట్ చేస్తోందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇపుడు అలాంటివే ఈ రక్షాబంధన్ వేళ సన్నివేశాలని అంటున్నారు.
