Begin typing your search above and press return to search.

లోకేశ్ దృష్టిలో పవన్ స్థానం ఎక్కడంటే..?

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి నారా లోకేశ్ ప్రభావం రానురాను పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగానే కాకుండా కీలకమైన మంత్రి పదవిలో కొనసాగుతున్న లోకేశ్ ప్రభుత్వంలో తన ముద్ర కచ్చితంగా ఉండేలా పనిచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2025 3:57 PM IST
లోకేశ్ దృష్టిలో పవన్ స్థానం ఎక్కడంటే..?
X

ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధినేత సీఎం చంద్రబాబు అయినా, ప్రభుత్వం చక్కటి సమన్వయంతో పనిచేయడానికి జోడెద్దుల్లా కష్టపడుతున్నది మాత్రం డిప్యూటీ సీఎం పవన్, టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్. ఈ ఇద్దరి కాంబినేషన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడమే కాకుండా, ప్రత్యర్థుల భరతం పట్టేలా కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. పది నెలలుగా ఇద్దరి మధ్య సమన్వయంతోపాటు పలు విషయాల్లో ఏకాభిప్రాయంతో నడుచుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న పవన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అభిమానం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి నారా లోకేశ్ ప్రభావం రానురాను పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగానే కాకుండా కీలకమైన మంత్రి పదవిలో కొనసాగుతున్న లోకేశ్ ప్రభుత్వంలో తన ముద్ర కచ్చితంగా ఉండేలా పనిచేస్తున్నారు. క్రమశిక్షణతో మెలగడమే కాకుండా రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టులు సాధించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి పాలనలో తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇక తాజాగా రిలయన్స్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల స్థాపనలోనూ మంత్రి లోకేశ్ పాత్ర సుస్పష్టం అంటున్నారు. అందుకే కనిగిరిలో సీబీజీ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా మంత్రి లోకేశ్ వెళ్లారు.

అయితే ప్రభుత్వంలో తన పాత్ర పెరుగుతున్నా, ఎక్కువ క్రెడిట్ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కు ఇస్తూ అనుకువ చాటుకుంటున్నారు మంత్రి లోకేశ్. ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పవన్ కు అధిక ప్రాధాన్యమివ్వడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందుతున్నారు. బుధవారం కనిగిరిలో జరిగిన సభలోనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సోదరుడని, తన తోడబుట్టిన అన్నయ్య అంటూ కీర్తించారు. వేసవి వచ్చేసిందని, అక్కడక్కడ తాగునీటి సమస్యపై సమాచారం వస్తోందని చెప్పిన మంత్రి లోకేశ్, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి తన అన్నయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మధ్యలో వదిలేసిన తాగునీటి పథకాలను పూర్తి చేసే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకున్నారని, ఆయన నిబద్ధత వల్ల కేంద్రం కూడా భారీగా నిధులిచ్చి ఆదుకుంటుందని చెప్పారు. తమ పాలనలో ప్రతి ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు.

కనిగిరిలో మంత్రి లోకేశ్ ప్రసంగం విన్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పరిణతి చెందిన నాయకుడిలా లోకేశ్ మాట్లాడుతున్నారని, కూటమి రాజకీయాల్లో సహజంగా తలెత్తే భేదాభిప్రాయాలకు కూడా చోటివ్వకుండా డిప్యూటీ సీఎం పవన్ తో మంచి సంబంధాలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్, లోకేశ్ మధ్య విభేదాలు రావా? తాము రాజకీయంగా ప్రయోజనం పొందమా? అంటూ ఎదురుచూస్తున్న ప్రత్యర్థులకు మంత్రి లోకేశ్ నిరాశకు గురిచేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఇసుమంతైనా విభేదాలు తలెత్తకుండా ఇద్దరూ నడుచుకోవడం గొప్ప విషయమంటున్నారు. పవన్ ను తన సొంత అన్నగా భావిస్తున్నట్లు చెబుతున్న లోకేశ్ పరోక్షంగా వైసీపీ విమర్శలకు చెక్ పెడుతున్నారని అంటున్నారు.