ఏపీ రాజధాని మీద లోకేష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాజధాని ఇష్యూ అన్నది ప్రజలు తేల్చేసిన వ్యవహారంగానే చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి వన్ సైడెడ్ గా జై కొట్టేశారు
By: Tupaki Desk | 13 Oct 2025 9:13 AM ISTఏపీలో రాజధాని ఇష్యూ అన్నది ప్రజలు తేల్చేసిన వ్యవహారంగానే చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి వన్ సైడెడ్ గా జై కొట్టేశారు. దాంతో వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం పూర్తిగా మరుగున పడిపోయింది. ఇక వైసీపీ నేతలు కూడా మూడు రాజధానుల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు, సమయం వచ్చినపుడు ఈ అంశం మీద స్పందించాలన్నది ఆ పార్టీ విధానంగా ఉంది. ఈ నేపధ్యంలో జనాలు కూడా అమరావతి ఏకైక రాజధాని స్పష్టంగానే ఉన్నారు. అంతే కాదు అమరావతి రాజధాని విషయంలో చూస్తే కనుక కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతోంది. అనేక ఆర్ధిక ఏజెన్సీల నుంచి నిధులను తెచ్చి పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది.
ఏకైక రాజధానిగా :
అమరావతి రాజధాని తొలి దశ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక కాల పరిమితిని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆ దిశగానే పనులు అన్నీ వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో విశాఖ వచ్చిన నారా లోకేష్ రాజధాని మీద ఆస్కతికరమైన వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజధానిగా ఒక్కటే ఉంటుందని అదే తమ విధానం అని ఫుల్ క్లారిటీగా చెప్పారు. అంటే వైసీపీ మూడు రాజధానుల నినాదాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చడమే కాదు ఎప్పటికీ అది చెల్లదని స్పష్టం చేశారు అని భావించాలి. అదే సమయంలో తమ విధానం అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన చెప్పారు
ఫోకస్ విశాఖ :
విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని లోకేష్ చెప్పారు. విశాఖని ఐటీ హబ్ గా చేస్తామని ఆయన అన్నారు. విశాఖలో వరసబెట్టి దిగ్గజ ఐటీ కంపెనీలు వస్తున్నాయని, రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు వస్తాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీని వల్ల ఏపీ వ్యాప్తంగా ఇరవై లక్షల దాకా ఉద్యోగాలు వస్తే ఉత్తరాంధ్రా విశాఖ ప్రాంతంలో అయిదు లక్షల దాకా ఉద్యోగాలు వస్తాయని ఆయన వివరించారు.
నోరెత్తకుండానేనా :
లోకేష్ ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అన్నది కూడా చర్చగా ఉంది. ఇపుడు అమరావతి అన్నది రాజధాని అని అందరికీ తెలుసు. ఏకైక రాజధాని అని కూడా తెలుసు. అయినా లోకేష్ ఈ విధంగా చెప్పడం వెనక వ్యూహాత్మకమైన వైఖరి ఉందని అంటున్నారు. కేవలం అమరావతి మీదనే ఫోకస్ పెట్టి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నది వైసీపీ వంటి పార్టీలు ఎపుడూ ప్రచారం చేయకుండా ఆ తరహా విమర్శలు భవిష్యత్తులో ఎక్కడా తలెత్తకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ లోకేష్ ప్రభుత్వ విధానం పదే పదే చెబుతున్నారు అని అంటున్నారు. దీంతో పాటు సహజంగానే విశాఖ విషయంలో ఒక ఆశ ఉంటుంది రాజధాని కావాల్సిన ప్రాంతం అని కూడా అంటారు. వైసీపీ కూడా విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెబుతూ వచ్చింది. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎలాంటి అసంతృప్తి ఎవరిలీ తలెత్తకుండా ఫుల్ క్లారిటీతో లోకేష్ ఈ విధంగా చెబుతున్నారు అని అంటున్నారు.
