లోకేశ్ కు జాతీయ స్థాయి గుర్తింపు? బిహార్ సీఎం ప్రమాణస్వీకారానికి స్పెషల్ ఇన్విటేషన్
ఇటీవల బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్లిన లోకేశ్.. 20వ తేదీన బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథిగా రమ్మంటూ ఆహ్వానం అందుకున్నారు
By: Tupaki Desk | 18 Nov 2025 7:30 PM ISTటీడీపీ భావినేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఇటీవల బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్లిన లోకేశ్.. 20వ తేదీన బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథిగా రమ్మంటూ ఆహ్వానం అందుకున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఆహ్వానం సహజమే అయినప్పటికీ ప్రత్యేకంగా మంత్రి లోకేశ్ కు కూడా ఆహ్వానం పత్రిక పంపడం చర్చనీయాంశం అవుతోంది. బిహార్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బదులుగా నారా లోకేశ్ పట్నాలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు.
బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం చంద్రబాబు ప్రచారానికి వెళ్లకపోగా, మంత్రి నారా లోకేశ్ ఆయనకు బదులుగా వెళ్లి ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. దీంతో లోకేశ్ వాయిస్ కు జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. ఇక ఎన్డీఏలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీ నేతలు హాజరుకావడం పరిపాటి. అదేవిధంగా ఏదైన రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందుతాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం పెద్ద విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు.
కానీ, మంత్రి లోకేశ్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడమే చర్చనీయాంశంగా మారింది. ఇది లోకేశ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని టీడీపీ సోషల్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ సైతం మంత్రి నారా లోకేశ్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీకి ప్రత్యేకంగా రమ్మని పిలిపించుకోవడమే కాకుండా, అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే మంత్రి నారా లోకేశ్ రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే 20న జరిగే కార్యక్రమానికి మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లేదీ? లేనిదీ? ఇంకా క్లారిటీ రాలేదు. ఇద్దరి పర్యటనపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సివుంది అంటున్నారు. బుధవారం ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రానికి ఆయన తిరిగి ఢిల్లీ వెళతారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన ఖరారు అవుతుందని అంటున్నారు. అయితే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ఇద్దరూ కలిసి వెళతారా? లేదా ఒకరే వెళ్తారా? అన్నది చూడాల్సివుంది.
