లోకేష్ గురించి కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో భారీ ఎత్తున ఏర్పాటు కానున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించారు మంత్రి నారా లోకేష్.
By: Satya P | 23 March 2026 10:00 PM ISTఅనకాపల్లి జిల్లా నక్కపల్లి లో భారీ ఎత్తున ఏర్పాటు కానున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించారు మంత్రి నారా లోకేష్. అతిధులను స్వాగతం పలకడం దగ్గర నుంచి వేదిక మీద తనదైన శైలిలో స్పీచ్ ఇస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇక స్టీల్ ప్లాంట్ భూమి పూజ జరిగే ప్రాంగణానికి కారు దిగి కాలు బయట పెట్టగానే ఆయనకు ఘన స్వాగతం పలికారు లోకేష్. అంతే కాదు ఆయనను వేదిక వద్దకు తోడ్కోని తీసుకుని వెళ్ళారు. అడుగడుగునా మర్యాద చూపిస్తూ లోకేష్ తీసుకున్న ఈ శ్రద్ధాసక్తులకు కేంద్ర మంత్రి ఎంతో పులకించిపోయారు. కేవలం ఆయన ఒక్కరినే కాదు ప్రతీ అతిధినీ అంతే ఆప్యాయంగా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో అయితే సరే సరి. ఒక అన్నగా ఆయన మీద ఎంతో సోదరభావం లోకేష్ చూపిస్తూ ఉంటారు. అది మరోసారి నక్కపల్లి లో వ్యక్తం అయింది. ఇద్దరూ కలసి ముచ్చటించుకుంటున్న సన్నివేశాలు అందరినీ అలరించాయి.
తండ్రికి తగిన తనయుడు :
మంత్రి నారా లోకేష్ డైనమిక్ లీడర్ షిప్ క్వాలిటీస్ ని స్వయంగా చూసిన కేంద్ర మంత్రి కుమార స్వామి అయితే ఏకంగా అతి పెద్ద కితాబు ఇచ్చేశారు తండ్రి చంద్రబాబుకు తగిన తనయుడు నారా లోకేష్ అని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంత్రిగా బాగా రాణిస్తున్నారు అని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాలను సాధిస్తోంది అని కుమారస్వామి మెచ్చుకున్నారు
బాబు పవన్ జోడీ :
అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పవన్ కల్యాణ్ నాయకత్వం అద్వితీయంగా రాణిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ప్రగతిశీలంగా అలాగే, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా చంద్రబాబు మార్చారని ప్రశంసించారు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏపీకి రావటం ఉత్తరాంధ్రా ప్రాంతానికి స్టీల్ ఎకోసిస్టమ్‌ను సాకారం చేసిందని కేంద్ర మంత్రి విశ్లేషించారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన 2047 వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ ఉత్పాదన పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా :
అంతే కాదు జాతీయ ఉక్కు వినియోగ విధానాన్ని అనుసరించి కూడా దేశవ్యాప్తంగా ఉక్కు ఉత్పాదన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. విశాఖ ఉక్కును గాడిలో పెట్టేందుకు ఉత్పాదన కూడా పెరిగేందుకు కేంద్రం ఆర్ధిక సహకారాన్ని అందించిందని కుమారస్వామి వివరించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ కుదుట పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చిందని చంద్రబాబుని కొనియాడారు. అలాగే ఆర్సెలార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు ఉత్పాదనకు మాత్రమే కాకుండా ఎంఎస్ఎంఈలకు ఉద్యోగ కల్పనకు ఓ చోదక శక్తిగా మారుతుందని అన్నారు. వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మితమై ఉత్పాదన ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
