లోకేష్ ని పిలిపించుకున్న మోడీ !
మోడీతో లోకేష్ ఏమి మాట్లాడుతారు అన్నది ఒక చర్చ అయితే కోరి మరీ తన వద్దకు ప్రధాని పిలిపించుకుంటున్నారు కాబట్టి ఆయన ఏమి లోకేష్ తో ముచ్చటిస్తారు అన్నది మరో చర్చగా ఉంది.
By: Tupaki Desk | 17 May 2025 7:00 AM ISTనారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు. చంద్రబాబు వారసుడు. ఆయన టీడీపీకి ఏకైక ఫ్యూచర్ లీడర్ అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఆయనకు ఏ పోటీ లేదు, మరే పేచీ పూచీ లేదు. ఆయన చేతిలోనే పార్టీ ఉంది. ఆయన హవా పార్టీలో కొనసాగుతోంది.
ఇక 2024 ఎన్నికల ముందు నుంచే పార్టీలో పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తన జోరుని మరింత పెంచేశారు. ఆయన పార్టీలో సర్వస్వం అయ్యారు. ప్రభుత్వంలో కీలకం అయ్యారు.
ప్రధాని విశాఖ అమరావతి సభలలో లోకేష్ తనదైన స్పీచ్ ఇచ్చి మోడీ దృష్టిని ఆకర్షించారు. విశాఖలో నమో అంటూ మోడీని కొనియాడిన నారా లోకేష్ అమరావతి సభలో అయితే ఆయనను ఒక మిసైల్ గా అభివర్ణించారు. ఇక లోకేష్ నేర్పరితనం, ఆయన దూకుడు అన్నీ ప్రత్యక్షంగా చూసిన నరేంద్ర మోడీ ముచ్చటపడ్డారు. విశాఖ సభలోనే ఆయన వేదిక మీద లోకేష్ ఉండగా దగ్గరకు వచ్చి మరీ తనను ఒకసారి ఢిల్లీలో కలవమని ఆఫర్ ఇచ్చారు.
అయితే లోకేష్ కలవలేదు. అది జనవరిలో జరిగిన ముచ్చట. ఇక మే 2న అమరావతి సభ జరిగినపుడు ప్రధాని దానిని మరోమారు గుర్తు చేస్తూ ఎందుకు ఢిల్లీ రావడం లేదు తనను కలవడం లేదు అని రెట్టించారని భోగట్టా. దాంతో లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ మోడీని కలవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు.
ఇక ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా మోడీతో భేటీకి అపాయింట్మెంట్ ఖరారు అయింది అన్న వార్త వచ్చింది. దాంతో లోకేష్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తన కుటుంబం సమేతంగా చేరుకుంటున్నారు. లోకేష్ ఇప్పటికా ప్రధాని మోడీని విడిగా కలిసింది లేదు అమిత్ షా తో ఆయన భేటీలు వేశారు కానీ మోడీతో కలవడం మాత్రం తొలిసారి.
పైగా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు దాంతో ఇది అత్యంత అసక్తికరమైన వార్తగా ఏపీ రాజకీయాల్లో ఉంది. మోడీతో లోకేష్ ఏమి మాట్లాడుతారు అన్నది ఒక చర్చ అయితే కోరి మరీ తన వద్దకు ప్రధాని పిలిపించుకుంటున్నారు కాబట్టి ఆయన ఏమి లోకేష్ తో ముచ్చటిస్తారు అన్నది మరో చర్చగా ఉంది.
ఇక చూస్తే దగ్గరలో మహానాడు టీడీపీ పార్టీ పండుగగా ఉంది. ఈసారి మహానాడులో లోకేష్ కి కీలకమైన బాధ్యతలతో పాటు పదోన్నతి ఉంటుందని అంటున్నారు. పార్టీలో ప్రభుత్వంలో పట్టుని పెంచుకుని ఏపీలో బలమైన రాజకీయ నాయకుడిగా మారుతున్న లోకేష్ మీద బీజేపీ కేంద్ర పెద్దల చూపు పడింది అని అంటున్నారు. ఇప్పటప్పట్లో ఏపీలో బీజేపీ ఎదిగేది లేదు. పొత్తులతోనే పార్టీ ముందుకు సాగాల్సి ఉంది.
దాంతో టీడీపీతో బలమైన చెలిమి అన్నది బీజేపీకి చాలా అవసరంగా ఉంది అని అంటున్నారు. అందుకోసమే ఆ పార్టీ భవిష్యత్తు నేత లోకేష్ తోనూ తమ బంధాన్ని అనుబంధాన్ని కొనసాగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీ పెద్దల దీవెనలు అయితే లోకేష్ కి నిండుగా ఉన్నాయని అంటున్నారు. కోరి మరీ తన వద్దకు లోకేష్ ని మోడీ పిలిపించుకోవడం అంటే ఒక విధంగా లోకేష్ కి ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీలో ఏ రకమైన సంచలనాలు నమోదు అవుతాయో.
