చంద్రబాబు డ్యూటీలో లోకేశ్.. నేటి అనంతపురం పర్యటన రద్దు
మంత్రి లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దు రాజకీయంగా ఆయనకు మరింత ప్రాధాన్యం పెంచిందని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Sept 2025 10:06 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వారసత్వమే కాకుండా, ఆయన నుంచి అన్ని రకాల బాధ్యతలను మంత్రి లోకేశ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తండ్రిగా మాత్రమే కాకుండా చంద్రబాబు తనకు రాజకీయ గురువుగా భావిస్తున్న లోకేశ్.. ప్రస్తుతం ఇంటా బయట అన్ని రకాల కార్యకలాపాల్లో తానే సర్వమై పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి తరఫున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులతోపాటు ఆపత్కాలంలో ప్రజలను ఆదుకునే విషయంలోనూ ఆయనే ముందుంటున్నారు. తాజాగా నేపాల్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారు, ముఖ్యంగా ఏపీ వారిని సురక్షితంగా తీసుకునే బాధ్యతను స్వీకరించారు లోకేశ్. ఇందుకోసం ఈ రోజు అనంతపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
మంత్రి లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దు రాజకీయంగా ఆయనకు మరింత ప్రాధాన్యం పెంచిందని అంటున్నారు. నేపాల్ లో నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో లోకేశ్ అనంతపురం పర్యటనను విరమించుకున్నారు. అంతేకాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. ఇక నేపాల్ బాధితుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి నారా లోకేష్.
నేపాల్ బాధితుల కోసం లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగడం ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును ప్రతిబింబిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగువారు ఆపదలో ఉన్నారంటే ముందుగా స్పందించేది చంద్రబాబు మాత్రమేనని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకున్నా విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు చొరవ చూపిస్తుంటారని, దీనికి ఆయన గత చరిత్రే నిదర్శనమని అంటున్నారు. ఒడిశా తుపానులు, ఉత్తరాఖండ్ వరదలు ఇలా రాష్ట్రం వెలుపల కూడా తెలుగు వారు ఇబ్బందులు పడితే చంద్రబాబు రంగంలోకి దిగి వారిని ఆదుకునేవారని, ఇప్పుడు ఆ బాధ్యతలు లోకేశ్ తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తండ్రి నుంచి కేవలం రాజకీయ వారసత్వమే కాకుండా, ఇతర అంశాలను లోకేశ్ అనుసరిస్తుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి ఇప్పుడు నేపాల్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఆయన వార్ రూమ్ ప్రారంభించినా, ఇంతకు ముందు విదేశాల్లో చిక్కుకున్న పలువురు కార్మికులను ఆయన రాష్ట్రానికి తెప్పించాన్ని విస్మరించకూడదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్లిన రాష్ట్రానికి చెందిన కార్మికులు అక్కడ మోసపోయిన అష్టకష్టాలు పడుతూ తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా లోకేశ్ ద్రుష్టికి తీసుకువెళ్లి ఆ కష్టాల నుంచి విముక్తి పొందిన ఉదంతాలు ఇటీవల చాలానే ఉన్నాయని అంటున్నారు.
