టీడీపీలో కవిత చేరిక ప్రచారం.. మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరనున్న ప్రచారంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భావి నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 10 Sept 2025 9:29 AM ISTబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరనున్న ప్రచారంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భావి నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తాను తరచూ కలుస్తానని చెప్పిన లోకేశ్.. కవిత టీడీపీలో చేరతారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాకుండా కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్మోహనరెడ్డితో పొత్తుపెట్టుకోవడానికి భిన్నంగా ఉండదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అంటే కవిత ఎప్పటికీ తమ రాజకీయ ప్రత్యర్థి అని లోకేశ్ స్పష్టం చేసినట్లైందని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీని రెండుగా చీల్చి కొత్త పార్టీ పెడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కవిత ఆశించినట్లు ఆమెతో కలిసి నడిచేందుకు కారు పార్టీ కేడర్ సిద్ధంగా లేనట్లు ప్రస్తుత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కు కవిత రాజీనామా చేసిన ఆమెకు మద్దతుగా పార్టీలో ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేకన్నా, ఏదో ఒక గుర్తింపు పొందిన పార్టీలో చేరడమే మంచిదని ఆమెకు రాజకీయ పండితులు సలహా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రామగ్రామాన పరిచయం ఉన్న తెలుగుదేశంపై ఆమె ఆసక్తి చూపినట్లు కథనాలు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ ఉనికి లేకపోయినా, కేడర్ ఉండటం వల్ల తన చేరికతో ఆ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని ఆమె సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని ఆమె ఆ పార్టీ అధిష్టానంతో సంప్రదించినట్లు ఊహాగానాలు వినిపించాయి.
ఇదిలావుండగా, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కవిత అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల్లో చేరేందుకు విముఖత చూపుతుండటం వల్ల, టీడీపీలో ఆమె చేరతారనే ప్రచారానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆమె గత నేపథ్యం వల్ల ఆయా పార్టీలే కవితను చేర్చుకునేందుకు సానుకూలత చూపలేదని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ఉనికి చాటుకోడానికి టీడీపీ బెటర్ అన్న ప్రతిపాదనను కవిత సీరియస్ గా పరిగణించారని అంటున్నారు.
అయితే తన ఆలోచనను కవిత టీడీపీ అధినాయకత్వం ద్రుష్టికి తీసుకువెళ్లారో లేదో కానీ, ఈ ప్రచారానికి టీడీపీ భావినేత లోకేశ్ మాత్రం ఫుల్ స్టాప్ పెట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను కవిత టీడీపీలో చేరికపై మీడియా ప్రశ్నించగా, ఒక్క మాటలో ఆమె చేర్చుకునే విషయాన్ని పరిగణించడం లేదని తేల్చిచెప్పారు. కవితను టీడీపీలో చేర్చుకోవడమంటే వైసీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనని వ్యాఖ్యానించడం చూస్తే, మాజీ ఎమ్మెల్సీని చేర్చుకోవడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పడమే కాకుండా, మరింత నష్టమని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
తండ్రి పెట్టిన పార్టీని ధిక్కరించి కవిత బయటకు రావడాన్ని ఏపీలో షర్మిలతో పోల్చుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న షర్మిల తన సోదరుడు జగన్ తో విభేదించి కొన్నాళ్లు తెలంగాణలో సొంతంగా పార్టీని పెట్టారు. దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, ఆమెకు ప్రజల్లో సానుభూతి లభించలేదు. దీంతో ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని ఏపీకి మార్చుకున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడంతో షర్మిల కష్టపడటమే కానీ, రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితే.. తెలంగాణలో టీడీపీకి ఉన్నందున కవితను చేర్చుకున్నా, టీడీపీకి ప్రయోజనం ఉండదని, పైగా ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సంబంధాలు దెబ్బతింటాయని టీడీపీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.
