లోకేశ్ ప్రజాదర్బార్.. ఎమ్మెల్యేల గుట్టురట్టు!
మంగళవారం టీడీపీ రాష్ట్రకార్యాలయంలో దాదాపు పది గంటల పాటు గడిపిన మంత్రి లోకేశ్ ప్రజల నుంచి సుమారు 5 వేల ఫిర్యాదులను స్పీకరించారు.
By: Tupaki Political Desk | 5 Nov 2025 1:39 PM ISTటీడీపీ యువనేత నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మంగళవారం టీడీపీ రాష్ట్రకార్యాలయంలో దాదాపు పది గంటల పాటు గడిపిన మంత్రి లోకేశ్ ప్రజల నుంచి సుమారు 5 వేల ఫిర్యాదులను స్పీకరించారు. అధికారంలోకి వచ్చిన నుంచి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. గెలిచిన కొత్తలో రోజూ ఈ కార్యక్రమం నిర్వహించగా, ఇటీవల పని ఒత్తిడి పెరిగిపోవడంతో వీలు చిక్కినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అధికారిక విధులతో పూర్తిగా బిజీ అయిపోయిన మంత్రి లోకేశ్ మంగళవారం తీరిక చూసుకుని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఇది ఆయన 70వ ప్రజాదర్బార్ కాగా, మంత్రితో తమ సమస్యలు చెప్పుకునేందుకు దాదాపు 5 వేల మంది వచ్చారు. ఇంతమంది రావడం చూసి ఆశ్చర్యపోయిన మంత్రి లోకేశ్.. ప్రజాదర్బార్ కు భారీ స్పందన ఒక విధంగా పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యంగా భావించారు. కార్యక్రమం అనంతరం పార్టీ నేతలతో సమావేమైన మంత్రి.. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై హాట్ కామెంట్స్ చేశారు.
తన ప్రజాదర్బార్ కు 5 వేల మంది వచ్చారంటే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సజావుగా సాగడం లేదనే అర్థం చేసుకోవాలని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిరోజూ పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ ఆఫీస్ బేరర్లుతో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు గతంలో ఆదేశించారు. అయితే గత ఏడాది ఈ కార్యక్రమం కొద్దిరోజులు క్రమం తప్పకుండా కొనసాగినా, కొద్దినెలలుగా గ్రీవెన్స్ నిలిపివేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. దీనిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి లోకేశ్ భావిస్తున్నారు. నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ నిర్వహించకపోవడం వల్లే తనకు 5 వేల ఫిర్యాదులు వచ్చినట్లు లోకేశ్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు ఇలా వ్యవహారించడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.
ఇకపై గ్రీవెన్స్ నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తామని, పార్టీ ఆదేశాలు పట్టించుకోని నేతలు, ఎమ్మెల్యేలు తగిన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి నియోజకవర్గాల్లో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారనే విషయమై తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని మంత్రి లోకేశ్ అదేశించారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహారశైలిని మంత్రి లోకేశ్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణిస్తే స్థానిక ఎమ్మెల్యే తగిన రీతిలో స్పందించలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి ఫరూక్ ను కారులో కూర్చోబెట్టి తప్పుగా ప్రొజెక్టు చేశారని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. సుబ్బానాయుడు కార్యక్రమానికి తాను కావలి వెళతానని మంత్రి సంకేతాలిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ‘ఏ నియోజకవర్గం ఏం జరుగుతుందో ఓ కన్నేసి ఉంచాలి’ అని మంత్రి లోకేశ్ సూచించారు. ఇదేసమయంలో సీనియర్ కొనకళ్ల నారాయణ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు విషయంలో ఆయన కులం కార్డు ప్రయోగిస్తే, కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత కొనకళ్ల సరిగా స్పందించలేదని లోకేశ్ ఎత్తిచూపారు. పార్టీలో సీనియర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని హితవుపలికారు.
