Begin typing your search above and press return to search.

లోకేష్ కి లైన్ క్లియర్ చేస్తున్న బాబు !

నారా లోకేష్ అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా ఎదిగారు. ఆయన ఎదిగిన తీరు కానీ పొలిటికల్ గ్రాఫ్ కానీ చాలా వేగంగా ఉంది.

By:  Satya P   |   12 Sept 2025 5:00 PM IST
లోకేష్ కి లైన్ క్లియర్ చేస్తున్న బాబు !
X

నారా లోకేష్ అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా ఎదిగారు. ఆయన ఎదిగిన తీరు కానీ పొలిటికల్ గ్రాఫ్ కానీ చాలా వేగంగా ఉంది. దిగ్గజ నేత తండ్రి చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో లోకేష్ రాజకీయ పాఠాలను అన్నీ క్షుణ్ణంగానే నేర్చుకున్నారు. ఒకనాడు రాజకీయ ప్రత్యర్ధులు పప్పు అన్న నోటితేనే నిప్పు అనిపించుకుంటున్నారు. చంద్రబాబు తాను ఒక నాయకుడిగా ఏ విధంగా బహువిధాలుగా తన సమర్ధతను వినియోగిస్తారో దాదాపుగా అదే విధంగా లోకేష్ ని తీర్చిదిద్దడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. లోకేష్ సైతం సీఎం గా చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ మంచి మార్కులే సంపాదిస్తున్నారు తాజాగా నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని ఏపీకి తెప్పించడంతో లోకేష్ పూర్తిగా విజయవంతం అయ్యారు. సింగిల్ హ్యాండ్ లో ఈ బిగ్ టాస్క్ ని డీల్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

అందరికీ చేరువగా :

మొదట పార్టీ కార్యకర్తలతో మొదలెట్టిన లోకేష్ వారికి అండగా ఉంటూ వచ్చారు. వారి బాగోగులు చూసే నేతగా ఎదిగారు. వారికి బీమా సదుపాయాన్ని కలుగచేసి ధీమాను పెంచి పార్టీ అంటే మనది అన్న భావన కలిగించారు. అంతే కాదు కష్టం వచ్చింది అంటే నేనున్నాను అని క్యాడర్ కి భరోసా కల్పించడంలో లోకేష్ ముందున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్ తోనే కాదు నాయకులతో కూడా సమావేశాలు పెడుతూ లోకేష్ పార్టీలో తన స్థానం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు.

వారికి సైతం అలా :

లోకేష్ ఏపీలోని కూటమిలో ఒక మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన కేవలం మంత్రి కాదు, కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన అయితే మంత్రులలో కలుగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు తన పార్టీకి చెందిన మంత్రులతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలోనూ తన పట్టును నిరూపించుకున్నారు. ఇక ఎంపీలతో ఆయన తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఎంపీలకు లోకేష్ దిశా నిర్దేశం చేసిన తీరుని చూసిన వారికి ఫ్యూచర్ లీడర్ ఎవరో అర్ధం చేసుకోవాల్సిందే అంటున్నారు.

బీజేపీ పెద్దలతో టచ్ లోకి :

ఇంకో వైపు చూస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లోకేష్ తరచూ సమావేశం అవుతూ టచ్ లోకి వస్తున్నారు. ఆయన ప్రధాని మోడీతో అలాగే హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతూ రావడం అన్నది కూడా కీలకంగా చూడాలని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రులు అందరినీ ఢిల్లీ వెళ్ళి కలుస్తూ ఏపీలో ప్రభుత్వానికి సాయం చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్ర పెద్దల వద్ద ఆయన తన పరపతిని సైతం పెంచుకుంటున్నారు అని అంటున్నారు. జాతీయ మీడియాను ఉద్దేశించి లోకేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసినా ఆయన జవాబులు చెప్పే విధానం గమనించినా ఆరితేరి నట్లుగానే కనిపిస్తున్నారు.

బాధ్యతలు అప్పగిస్తున్న వైనం :

గతంలో అయితే మూడు సార్లు చంద్రబాబు సీఎం గా పనిచేశారు. అప్పట్లో ఆయన ఫుల్ బిజీగా ఉండేవారు పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఢిల్లీ టూర్లు ఇలా క్షణం తీరిక లేకుండా రోజు గడచిపోయేది. కానీ ఇపుడు దాదాపుగా చాలా బాధ్యతలు అన్నీ లోకేష్ కి అప్పగిస్తున్నారు. అన్నింటికీ ఆయననే ముందుంచి పంపుతున్నారు. బాబు లోకేష్ కి వెనక ఉండి మార్గ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ సైతం తన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తూ తండ్రి బాటలో నడుచుకుంటున్నారు.

ముహూర్తం అపుడేనా :

ఇక చూస్తే కనుక లోకేష్ పట్టాభిషేకానికి పూర్వ రంగం అయితే సిద్ధంగానే ఉంది అని అంటున్నారు. ఈ నాలుగేళ్ళ పాటు ఏపీకి సీఎం గా చంద్రబాబు కొనసాగుతారు 2029లో కూటమి అధికారంలోకి వస్తే కనుక కచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని అంటున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్ల సానుకూలంగా ఉంటున్నారు. టీడీపీ కూటమిలో పెద్దన్నగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎటూ కూటమి ఏపీలో పదిహేనేళ్ళు కొనసాగాలని జనసేన కోరుకుంటోంది. దాంతో కచ్చితంగా లోకేష్ సీఎం కావడానికి ఏ రకమైన అభ్యంతరాలు ఎవరూ ఉండవని అంటున్నారు. ఈ నాలుగేళ్ళు మాత్రం లోకేష్ మరింతగా పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు సాధిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన నాయకుడిగా ఇంకా రాటు తేలి వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ గా రెడీగా ఉంటారని అంటున్నారు.