Begin typing your search above and press return to search.

శాసనమండలికి బొత్స.. విపక్ష నేతకు ఆత్మీయ పలకరింపులు

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం సభకు హాజరయ్యారు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురైన బొత్స హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.

By:  Tupaki Political Desk   |   6 March 2026 3:48 PM IST
శాసనమండలికి బొత్స.. విపక్ష నేతకు ఆత్మీయ పలకరింపులు
X

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం సభకు హాజరయ్యారు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురైన బొత్స హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం కుదుట పడటంతో మండలి ముగింపు సమావేశాలకు హాజరయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడంపై పార్టీలకు అతీతంగా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక మండలికి హాజరైన బొత్సను టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

శాసనమండలి సమావేశాలకు హాజరైన బొత్సను మంత్రి లోకేశ్ పరామర్శించారు. తొలుత మంత్రి పలకరిస్తున్నా, బొత్స వినిపించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. అయితే మండలి చైర్మన్ మోషేన్ రాజు కల్పించుకుని మంత్రి లోకేశ్ పలకరిస్తున్నారంటూ బొత్సకు చెప్పడంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నారు. మంత్రి లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత గురువారం రాత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయనకు అధిక రక్తపోటు కారణంగా ఆస్పత్రిలో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లిన బొత్స. అక్కడే వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయితే మీడియాలో ప్రచారం జరిగినట్లు ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురికాలేదని, రక్త పోటులో తేడా వల్ల ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని కుటుంబ సభ్యులు వివరించారు. ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల బొత్సకు అధిక రక్తపోటు వచ్చిందని వివరించారు. ఇక హైదరాబాద్ లో బొత్సను రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు పరామర్శించారు.

వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న బొత్స గురువారం డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత నెల 11న ప్రారంభమైన మండలి సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. చివరి వారం రోజులు తప్ప, మిగిలిన అన్నిరోజులు బొత్స మండలికి హాజరయ్యారు. తన పార్టీ గళాన్ని వినిపించారు. ఇక శుక్రవారం సభలో బొత్స కనిపించగానే అందరి కంటే ముందుగా మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స సత్యనారాయణ గారు నమస్కారం అంటూ మంత్రి లోకేశ్ పలకరించారు. ఆ మాటలను వినకపోవడంతో చైర్మన్ కల్పించుకుని మంత్రి పిలుస్తున్నారంటూ చెప్పారు. ‘‘గురువు గారు చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్ కు రావడం ఆనందంగా ఉందని’’ వ్యాఖ్యానించారు.