'బలమైన' హామీ సాకారానికి లోకేష్ భూమి పూజ!
గత ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ నెరవేరుస్తున్నారు.
By: Garuda Media | 10 March 2026 6:34 PM ISTగత ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ నెరవేరుస్తున్నారు. తాజాగా గత ఎన్నికల సమయంలో ఇక్కడి నదీతీర ప్రాంతం వాసుల సమస్యలు పరిష్కరించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి తాజాగా భూమి పూజ చేయడం గమనార్హం. తాడేపల్లి రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేయడంతో స్థానికంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ రక్షణ గోడ నిర్మాణానికి 294 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నారు.
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన రెండున్నర కిలో మీటర్ల మేరకు కృష్ణా నది కుడివైపున ఈ వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేసినట్టు అయింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు కేవలం ఏడాది కాలంలోనే 294 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. భవిష్యత్ లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్ తో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.
బలమైన కట్టడం!
కేవలం సాధారణ గోడగా కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి, పైల్- రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50 వేల మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది.
