జగన్.. శరణమా.. న్యాయ సమరమా?: లోకేష్ షాకింగ్ ట్వీట్
టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి షాకింగ్ ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 15 Jun 2025 6:18 PM ISTటీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి షాకింగ్ ట్వీట్ చేశారు. ''మిత్రమా..'' అంటూ.. కొత్తగా సంబోధించారు. అంతేకాదు.. తొలిసారి ``గారు`` అంటూ.. మరో లైన్‌లో ``ఫేక్`` అంటూ.. తన దైన శైలిలో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పార్టీ నాయకులు సహా ప్రతిపక్ష నేతలు కూడా ఆలోచన చేస్తున్నారు.
ఏం జరిగింది?
కూటమి సర్కారు గురువారం ప్రారంభించిన కీలకమైన తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకులు సహా జగన్ విమర్శలు గుప్పించారు. ఈ పథకం కింద తల్లులకు రూ.15000 ఇస్తామని రూ.13000 చొప్పున విదించారని పేర్కొన్నారు. మరి మిగిలిన రూ.2000 ఎవరి ఖాతాలోకి వెళ్లాయని వారు ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ సొమ్ములు నారా లోకేష్ ఖాతాలోకే వెళ్లాయని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారమే స్పందించిన నారా లోకేష్.. వైసీపీ నాయకులను కడిగి పారేశారు.
తాను ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. విద్యావ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించారని.. దానిని సరిచేసేందుకు తనకు 9 మాసాల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఇక, తల్లికి వందనం పథకంపై చేసిన విమర్శలకు 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని.. పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించకపోతే.. ఆ మాటలను వెనక్కి తీసుకుని సారీ చెప్పాలన్నారు. లేకపోతే.. న్యాయపరంగా చర్యలు తప్పవని శుక్రవారం చేసిన ట్వీట్‌లో నారా లోకేష్ హెచ్చరించారు.
అయితే.. ఆయన ఇచ్చిన గడువు.. శనివారం సాయంత్రంతో ముగిసినా.. వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. దీంతో నారా లోకేష్ సీరియస్‌గా రియాక్ట్ అయి.. షాకింగ్ ట్వీట్ పెట్టారు. ``బురద జల్లడం ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం సొమ్ముల్లో 2000 నా ఖాతాలోకి వెళ్లాయని.. ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు 24 గంటల సమయం ఇచ్చాను. సమయం ముగిసింది. అయినా నిరూపించలేకపోయారు. క్షమాపణ కూడా కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం. సమయం లేదు మిత్రమా.. శరణమా.. న్యాయ సమరమా..? తేల్చుకోండి..`` అని నారా లోకేష్ పోస్టు చేశారు.
