బీజేపీ గుడ్ లుక్స్ లో లోకేష్!
ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రులను వరసబెట్టి కలుస్తున్నారు.
By: Tupaki Desk | 19 Jun 2025 6:00 AM ISTఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రులను వరసబెట్టి కలుస్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ టూర్ లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఏంటి అంటే భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ని కలవడం. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు.
అటువంటిది ఆయనను కలవడమే ఎక్కువగా ఆసక్తిని రేపింది. జగదీప్ ధన్ ఖర్ ఉప రాష్ట్రపతి కాక ముందు బీజేపీలో అగ్రనేతలకు సన్నిహితులైన వారు. ఆయన కమల దళంలో ప్రముఖులుగా ఉన్నారు. ఆయనను కలవడం మర్యాదపూర్వకంగా అని టీడీపీ వర్గాలు చెప్పాయి.
ఇక ఉప రాష్ట్రపతితో లోకేష్ సమావేశం కూడా చక్కగా సాగింది. యువ నేతగా ఉన్న లోకేష్ తో ఉప రాష్ట్రపతి చాలా విషయాలు చర్చించారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధంగా ఈ మీటింగ్ ఆసక్తిని పెంచితే మరో సమావేశం కూడా చర్చనీయాంశం అయింది.
అదే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశం. దాదాపుగా అరగంట పాటు లోకేష్ కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించారు అని పార్టీ నేతలు చెప్పారు. అంతే కాకుండా లోకేష్ తాను చేసిన వేలాది కిలోమీటర్ల యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు.
దాంతో అమిత్ షా లోకేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. లోకేష్ ప్రజలతో మేమేకం అయిన తీరుని ప్రశంసించారు. ఇక చూస్తే కనుక గత నెలలో ప్రధాని మోడీ వద్దకు వెళ్ళినపుడు తన పుస్తకాన్ని ఆయనకు అందించి ఆయన ఆశీస్సులు కూడా లోకేష్ తీసుకున్నారు.
చాలా సేపు ఆనాడు మోడీతోనూ లోకేష్ చర్చించారు. ఇపుడు అమిత్ షాతో భేటీతో కేంద్ర పెద్దల గుడ్ లుక్స్ లో యువ నేత ఉన్నారు అన్న సంకేతాలు అందించారు. ఏపీలో టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ. సొంతంగా రాజకీయం చేస్తున్న పార్టీ. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్నందువల్ల బీజేపీ పెద్దలతోనూ సాన్నిహిత్యం పెంచుకోవాల్సి ఉంది.
అందుకే ఇపుడు ఆ పనిని లోకేష్ విజయవంతంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మీదట ఆయన తరచుగా ఢిల్లీ రాబోతున్నారు అని అంటున్నారు. రాష్ట్రానికి స సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి వాటిని పరిష్కరించుకోవడం అదే సమయంలో కేంద్ర పెద్దలను కలసి వారితో మరింత అనుబంధం పెంచుకోవడం ఇలా బహుముఖీయమైన కార్యాచరణతో లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఉండబోతున్నాయని అంటున్నారు.
గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు వరసబెట్టి ఢిల్లీ టూర్లు చేశారు. మొత్తం 29 సార్లు ఢిల్లీ పర్యటనలు చేశాను అని ఒక సందర్భంలో బాబు చెప్పుకున్నారు. అది నాటి పరిస్థితి. ఇపుడు కలసి వచ్చిన కొడుకుగా లోకేష్ ఉన్నారు. పైగా జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కి ఎలివేషన్ అవసరమని టీడీపీ వ్యూహంగా పెట్టుకుంది. దాంతో రానున్న రోజులలో ఢిల్లీ యాత్రలు ఎక్కువగా లోకేష్ చేపడతారు అని అంటున్నారు. అలా ఏపీకి కేంద్రం నుంచి ఏ సాయం దక్కినా అది లోకేష్ క్రెడిట్ ఖాతాలో పడుతుందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ హస్తిన పర్యటనలు ఎపుడూ స్పెషల్ గానే ఉండబోతున్నాయని అంటున్నారు.
