ఢిల్లీలో లోకేశ్ కొత్త రికార్డు.. చంద్రబాబును మరిపించేలా ఢిల్లీ టూర్
ఈ పర్యటనలో తొలిసారిగా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. ఆయనకు టీడీపీ, జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
By: Tupaki Desk | 20 Aug 2025 1:37 PM ISTఏపీ మంత్రి, టీడీపీ భావినేత లోకేశ్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన లోకేశ్ మంగళవారం తిరిగొచ్చారు. సోమవారం రోజాంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన మంత్రి లోకేశ్.. ఢిల్లీలో తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మరిపించేలా పలు కార్యక్రమాలను ముగించారు. సహజంగా ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబుకు ఓ రికార్డు ఉంటుంది. ఆయన ఢిల్లీ వచ్చారంటే ప్రాజెక్టులు, ఫండ్స్ అంటూ కేంద్ర మంత్రులను వరసపెట్టి కలుస్తూ రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తారని చెబుతుంటారు. అయితే ఈ సారి ఆ పనిని లోకేశ్ పూర్తి చేశారని అంటున్నారు. ఢిల్లీలో ఏకధాటిగా 13 గంటలపాటు 8 మంది కేంద్రమంత్రులను కలిసిన లోకేశ్.. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. కోరుకున్న ప్రాజెక్టులను సాధించారని చెబుతున్నారు.
ఈ పర్యటనలో తొలిసారిగా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. ఆయనకు టీడీపీ, జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇక కేంద్ర మంత్రులతో ముందస్తు అపాయింట్మెంట్ తీసుకున్న లోకేశ్.. కేవలం 13 గంటల్లో 8 మంది కేంద్ర మంత్రులను కలవడం విశేషంగా చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో లోకేశ్ భేటీ విజయవంతం అయిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సరపడా ఎరువులు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలను తీర్చడమే అజెండాగా పెట్టుకున్న లోకేశ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై రాష్ట్రానికి 29 వేల టన్నుల యూరియా సరఫరా చేసేలా ఒప్పించారు. కేవలం మూడు రోజుల్లో యూరియా రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేయడం రైతులకు మేలు చేస్తోందని అంటున్నారు.
అదేవిధంగా రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, షిప్పింగ్, ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్, రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ తో లోకేశ్ వరుసగా భేటీ లయ్యారు. కేంద్ర సహకారం, అభివృద్ధి పనులకు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్సు తేవడం వంటి విషయాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. ఇదే సమయంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ముగిసిన సింగపూర్ పర్యటన విశేషాలను కేంద్ర మంత్రులతో పంచుకున్నట్లు చెబుతున్నారు.
ప్రధానంగా లోకేశ్ పర్యటనతో ఖరీఫ్ రైతులకు మేలు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేశ్ ప్రయత్నాల వల్ల బుధవారం నాటికి 29 వేల టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేసమయంలో ఏపీలో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు లోకేశ్. ఇక నితిన్ గడ్కారీతో సమావేశంలో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెడుతున్న కానూరు-బందరు హైవే విస్తరణపై చర్చించారు. అదేవిధంగా ఇప్పటికే మంజూరు చేసిన హైదరాబాద్-గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా డీపీఆర్ లో చేర్చాలని కోరారు. అదేవిధంగా విజయవాడ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తూర్పు బైపాస్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు అందించారు.
ఇదే సమయంలో దేశంలో అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేలా లోకేశ్ ప్రయత్నాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివరి నాటికి బీపీసీఎల్ రిఫైనరీ పనులు ప్రారంభించేందుకు రాష్ట్రం తరపున అన్నివిధాల సహాయ, సహాకారాలు అందిస్తున్నామని కేంద్రం తరఫున తన వంతుగా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగు పూరిని కోరారు లోకేశ్.. ఇక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే కార్మికులకు బీమా కల్పించాలనే వినూత్న ఆలోచనకు సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ స్కీమ్ ద్వారా విదేశాల్లో పనుల కోసం వెళుతున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరుఫున సహకారం అందే అవకాశం ఉందంటున్నారు. ఇలా 8 మంది మంత్రులతో సమావేశమైన లోకేశ్ తన పర్యటనను దిగ్విజయంగా ముగించారు. వాస్తవానికి లోకేశ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఢిల్లీ వస్తారని అనుకున్నా, చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దైంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో సర్వం తానై లోకేశ్ అడుగులు వేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
