డేటా సెంటర్లపై డౌట్లు.... లోకేష్ హాట్ కామెంట్స్ !
ఏపీలో విశాఖలో డేటా సెంటర్లు రెండు వస్తున్నాయి. అందులో ఒకటి విశాఖలో వస్తే రెండవది విజయనగరం జిల్లా భోగాపురం వద్ద వస్తోంది.
By: Satya P | 2 Jun 2026 12:23 AM ISTఏపీలో విశాఖలో డేటా సెంటర్లు రెండు వస్తున్నాయి. అందులో ఒకటి విశాఖలో వస్తే రెండవది విజయనగరం జిల్లా భోగాపురం వద్ద వస్తోంది. ఒకటి గూగుల్ డేటా సెంటర్ అయితే రెండవది రిలయెన్స్ వారిది. రెండు మెగా ప్రాజెక్టులే. రెండింటి వల్ల కూడా ఎంతో ప్రయోజనం సమకూరుతుందని ఒక వైపు చర్చ సాగుతూంటే మరో వైపు డేటా సెంటర్ల వల్ల జాబ్స్ పెద్దగా రావు కానీ పొల్యూషన్ మాత్రం వస్తుందని హెచ్చరికలు కొందరు మేధావులు చేస్తున్నారు. అంతే కాదు బిగ్ డిబేట్స్ పెడుతూ డేటా సెంటర్ల వల్ల విద్యుత్ నీరు వంటివి కూడా పెద్ద ఎత్తున తీసుకుని పోతాయని ఫలితంగా జనాలకు వాటి విషయంలో కరవు ఏర్పడుతుందని అన్నారు. దాంతో ఒక వైపు సందేహాలు మరో వైపు భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వీటి మీద ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు.
సందేహాలు వద్దు :
డేటా సెంటర్ల మీద అసలు ఏ మాత్రం కూడా అపోహలు వద్దే వద్దు అని మంత్రి చెబుతున్నారు. అసలు ఈ విషయంలో ప్రజలలో నెలకొన్న అనవసర భయాలను సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్‌లో భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం - ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో లోకేష్ మాట్లాడారు. ఆయన ఇదే సందర్భంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ముఖ్యంగా డేటా సెంటర్లపైన ఆయన మాట్లాడుతూ డేటా సెంటర్లు మంచివని కొందరు అంటే కావు చెడ్డవని మరి కొందరు అంటున్నారు అని ప్రస్తావించారు. అయితే వీటి మీద వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
వారిలో భరోసా పెంచాలి :
నీటి కొరత విషయం తీసుకుంటే ఏపీలో ప్రతి ఏటా గోదావరి నుంచి దాదాపు మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోందని లోకేష్ గుర్తు చేశారు. ఇక ఏపీలో నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు అవసరమయ్యేది కేవలం ఒక్క టీఎంసీ నీరు మాత్రమే అని ఆయన అన్నారు. అంతే కాకుండా ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే ఏడు రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని లోకేష్ చెప్పారు. అయితే నీటి అధిక వినియోగం డేటా సెంటర్ల వల్ల అని కొత్త చర్చను లేవదీస్తున్నారు అని లోకేష్ చెప్పారు. అయితే డేటా సెంటర్ల వల్ల మంచి జరుగుతుందని యువతకు వివరించి వారిలో భరోసా పెంచాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
రేపటి భవిష్యతు ఏఐ డేటా సెంటర్లు :
రేపటి దేశానికి అసలైన భవిష్యత్తు ఏఐ డేటా సెంటర్లు అని నారా లోకేష్ అన్నారు. ఏఐని ఏపీలో టాప్ లో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు అని లోకేష్ అన్నారు. ఇక ఏపీలో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. దానిలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ కి గూగుల్ డేటా సెంటర్‌ను తెచ్చామని తీసుకువచ్చామని ఆయన చెప్పారు ఇక డేటా సెంటర్ల ద్వారా కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదని పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయని లోకేష్ వివరించారు. వీటి వల్ల ఎకో సిస్టం డెవలప్ అయి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన పెరుగుతుందని లోకేష్ వివరించారు.
