మీ లెక్కలు తేలుస్తా.. వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్
తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు కోత విధించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:30 AM ISTతల్లికి వందనం పథకంలో రూ.2 వేలు కోత విధించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు టైము ఇస్తున్నానని, 24 గంటల్లో వారు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లోకేశ్ మాస్ వార్నింగుతో మళ్లీ వైసీపీ నేతల అరెస్టులు ఉంటాయా? లేక కోర్టులో వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేసి న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది.
తల్లికి వందనం పథకంలో మినహాయించిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధి కోసం పాఠశాల నిధికి ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రూ.2 వేలు మంత్రి లోకేశ్ సొంత ఖాతాకు వెళుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ తనపై ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించకపోతే సిరయస్ యాక్షన్ ఉంటుందని హెచ్చిరించారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని చెప్పిన లోకేశ్... ఆరోపణలను నిరూపించలేని పక్షంలో తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించారు.
వైసీపీ నేతలకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో 67,27,164 మంది విద్యార్థులకు రూ.8,745 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముందుగా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో రూ.2 వేలు తగ్గించడాన్ని ప్రతిపక్ష వైసీపీ తప్పుపడుతోంది. అయితే తగ్గించిన రూ.2 వేలు మంత్రి నారా లోకేశ్ సొంత ఖాతాకు జమ అయ్యాయని వైసీపీ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి.
తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని మంత్రి సవాల్ చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి సవాల్ ను వైసీపీ స్వీకరిస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, తమ నేతలను అరెస్టు చేయిస్తున్నారని వైసీపీ చెబుతోంది. ఈ పరిణామాల్లో మళ్లీ లోకేశ్ పై విమర్శలు చేయడంతో మిస్ ఫైర్ అయ్యారా? అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. రాజకీయంగా ఏ విమర్శ అయినా చేయొచ్చని, కానీ ఆధారాలు లేని విమర్శలు వల్ల రాజకీయంగా నష్టమే ఎక్కువ జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంత్రి లోకేశ్ తన ప్రత్యర్థులపై కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు అధికారంలో ఉండగా, ప్రత్యర్థులను అంత తేలిగ్గా విడిచిపెడతారా? అన్నది కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఎపిసోడ్ ను వైసీపీ ఎలా టర్న్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
