అనంతలో భారీ బహిరంగ సభ.. అయినా ఆర్టీజీఎస్ లోనే మంత్రి లోకేశ్!
ఉదయాన్నే అనంతపురం పర్యటనకు వెళ్లాల్సిన ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకున్నారు.
By: Tupaki Desk | 11 Sept 2025 11:17 AM ISTఅటు ఐదు లక్షల జనం.. ఇటు 217 మంది పర్యాటకుల ప్రాణాలు.. రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోడానికి ఈ రెండూ చక్కని అవకాశాలు.. కానీ, ఈ రెండు ఒకేసారి సవాల్ విసిరినప్పుడే నిజమైన నాయకుడు తెలివైన నిర్ణయం తీసుకుంటాడు. ఐదు లక్షల మంది ముందు నిల్చొని మాట్లాడటం ఒక అరుదైన అవకాశమే.. కానీ, 217 మంది ప్రాణాలను కాపాడటం అంతకు మించిన బాధ్యత. అందుకే మంత్రి నారా లోకేశ్ రెండోదాన్ని ఎంచుకున్నారని పరిశీలకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిణతి చెందిన నాయకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారని అభినందిస్తున్నారు.
నేపాల్ అల్లర్లలో ఏపీకి చెందిన వారు 217 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో అంతర్గత సమస్యల వల్ల సైన్యం కర్ఫ్యూ విధించగా, ఆలయాల సందర్శనకు వెళ్లన తెలుగు వారు తిరిగి దేశానికి చేరుకునే అవకాశం కోల్పోయారు. తమ భద్రతపై ఆందోళనతో రక్షించాలని వేడుకుంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ కొందరు, మంత్రి నారా లోకేశ్ కు సమాచారం పంపి మరికొందరు ఆపన్న హస్తం అందించాలని ప్రాధేయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. మానవ వనరుల మంత్రి అయిన లోకేశ్ తన బాధ్యత గుర్తు చేసుకుని స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయాన్నే అనంతపురం పర్యటనకు వెళ్లాల్సిన ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకున్నారు. దాదాపు 12 గంటల పాటు అక్కడే ఉండి.. నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని వారు తిరిగి రాష్ట్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
అయితే మంత్రిగా ఓ రాజకీయ పార్టీకి భావి నేతగా లోకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాను లేకున్నా, అధికారులతో సమన్వయం చేసి నేపాల్ బాధితులను క్షేమంగా తిరిగి రాష్ట్రానికి తెప్పించే అవకాశం ఉన్నా, లోకేశ్ మాత్రం ఆ చాన్స్ తీసుకోలేదని అంటున్నారు. ఒక వేళ లోకేశ్ ఈ చాన్స్ తీసుకుని అనంతపురంలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు వెళితే ఎన్నో విమర్శలు ఎదుర్కొనేవారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించింది. సుమారు ఐదు లక్షల మందితో జరిగిన ఈ సభకు వ్యూహాత్మకంగా రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత వైసీపీకి మంచి పట్టున్న ఆ ప్రాంతంలో గత ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.
ఇప్పుడు అక్కడ సమావేశం నిర్వహించడం ద్వారా టీడీపీ కూటమి తన పట్టును విస్తరించాలని భావించింది. భావి నేతగా ప్రచారంలో ఉన్న లోకేశ్ కు ఈ సభ చాలా కీలకం. ఈ సభ ద్వారా పార్టీలో ప్రభుత్వంలో వారసుడిగా మరింత ప్రచారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ, అనూహ్యంగా నేపాల్ అల్లర్లలో తెలుగు వారు చిక్కుకోవడంతో లోకేశ్.. అమరావతికే పరిమితం కావాల్సివచ్చింది. అయితే ఆయన ఇలా ఆర్టీజీఎస్ కేంద్రానికి రావడం వల్లే ఎక్కువ గుర్తింపు వచ్చిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెస్యూ ఆపరేషన్ లో విసుగు, విరామం లేకుండా లోకేశ్ గడపడం ద్వారా తనలోని పరిణితి చెందిన నాయకుడిని ఆవిష్కరించారని అంటున్నారు. గతంలో ఇలాంటి సందర్బాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకంగా వ్యవహరించేవారు. కానీ, ఇప్పుడు లోకేశ్ ఆ బాధ్యత తీసుకుని చంద్రబాబు స్థానాన్ని ఆక్రమించారని అంటున్నారు.
