బ్రాహ్మణి చీర వైరల్.. ఇంట్రస్టింగ్ పాయింట్ చెప్పిన లోకేశ్
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు. సహజంగా సెలబ్రెటీల ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
By: Tupaki Desk | 7 Aug 2025 6:21 PM ISTఏపీ మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణి గురించి ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ బయట పెట్టారు. సొంత నియోజకవర్గం మంగళగిరి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన లోకేశ్.. అదే సమయంలో మంగళగిరి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. చేనేత వస్త్రాలకు మంగళగిరి ప్రసిద్ధి చెందింది. మంత్రి లోకేశ్ నియోజకవర్గం కూడా మంగళగిరి కావడం విశేషం. దీంతో తన స్వీయ అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
తన భార్య బ్రాహ్మణి మంగళగిరి చీరను ఒక సారి కట్టుకుందని, ఆ చీర వైరల్ కావడంతో అదే రంగు ఉన్న చీరను అదే షాపులో 98 మంది కొనుగోలు చేశారని లోకేశ్ చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పిన లోకేశ్.. తన భార్య పరోక్షంగా మంగళగిరి వస్త్రాలకు బ్రాండింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కట్టిన చీరను నచ్చి ఒకే షాపులో అదే చీరను 98 మంది కొనుగోలు చేయడమంటే సాధారణ విషయం కాదని లోకేశ్ అభిప్రాయపడినట్లు భావిస్తున్నారు.
లోకేశ్ మంగళగిరి నుంచి గెలిచిన తర్వాత అక్కడి చేనేత, స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరిలో తన స్థానం సుస్థిరం చేసుకునేలా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు. సహజంగా సెలబ్రెటీల ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అయితే తన నియోజకవర్గంలో చేనేత కార్మికులకు కష్టానికి బ్రాండింగ్ అద్దడంలో భాగంగా తన సతీమణి కట్టుకున్న చీర వైరల్ అయిందని లోకేశ్ చెప్పడం ద్వారా చేనేత కార్మికులతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పడమే అంటున్నారు.
